Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో విభేదించే స్వామీజీలు అందరినీ వైసీపీ అధినేత జగన్ చుట్టబెట్టేస్తున్నారు. ఈ కోవలో విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానంద ముందు వరసలో ఉండేవారు. ఇప్పుడు ఇంకో స్వామి ఆయనకి తోడు అయ్యారు. ఆయనే శ్రీశ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి. టీటీడీ లో అనుసరిస్తున్న విధానాలు, నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ వస్తున్న చినజీయర్ కి ఎందుకో చంద్రబాబు అంటే అంత మంచి అభిప్రాయం ఉన్నట్టు లేదు. అందుకే ఆయన అడపాదడపా తన అసంతృప్తిని ఏదో రకంగా బయటపెడతారు.
ఆంధ్రప్రదేశ్ లో పుట్టినప్పటికీ రాష్ట్ర విభజన తరువాత ఆయన తెలంగాణ సర్కార్, సీఎం తో మెలిగిన దాంట్లో ఒక్క వంతు కూడా బాబు తో సన్నిహితంగా లేరు. ఈ గ్యాప్ కి అసలు కారణాలు ఏమిటో వారికే తెలియాలి. అయితే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ స్వయంగా స్వామి వద్దకు రావడానికి కూడా ఇది కూడా ఓ కారణం. ఒకప్పుడు స్వామి వద్దకు తెలంగాణ సీఎం కెసిఆర్ ని తీసుకెళ్లిన మై హోమ్, మహా సిమెంట్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు ఇప్పుడు జరిగిన భేటీలోనూ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.
కెసిఆర్ కి అత్యంత సన్నిహితుడిగా పేరుపడ్డ జూపల్లి జగన్ స్వామి వారి ఆశ్రమానికి వచ్చినప్పుడు వారి తోటే వున్నారు. ఈ భేటీ ఏర్పాటులో ఆయనే కీలక పాత్ర పోషించారట. ఇక జగన్, చినజీయర్ మధ్య చర్చల్లో ఏపీ రాజకీయాలకే ప్రధాన ప్రాధాన్యం లభించినట్టు తెలుస్తోంది. పార్టీ అంతర్గత వ్యవహారాలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై జగన్ స్వామితో మనసు విప్పి మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇంకో వైపు బీజేపీ కి దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తున్న జగన్ తనపై వున్న క్రైస్తవ ముద్ర తుడుచుకోడానికే ఇలా స్వామీజీలని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డట్టు కూడా చెప్పుకుంటున్నారు.