Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దరిద్రాన్ని కొని తెచ్చుకోవడం అంటే ఎలా ఉంటుందో సాక్షి పత్రికను చూస్తే అర్ధం అవుతుంది. తన రాజకీయ భవిష్యత్ కి అండగా ఉంటుందని జగన్ సాక్షి పత్రిక నడుపుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి మరీ ఆ పత్రికని నిర్వహిస్తున్నారు. అయితే అందులో పనిచేసే వాళ్ళు జగన్ లక్ష్యానికి దూరంగా ఆ పత్రిక ని తీసుకెళ్తున్నారు. అతి సర్వత్రా వర్జయేత్ అన్న సూక్తిని పట్టించుకోకుండా జగన్ ఏమి చేసినా పొగడడం, చంద్రబాబు ఏమి చేసినా తిట్టడం అన్న చందాన సాక్షిని తయారు చేశారు. దీంతో సాక్షి ని ఓ దినపత్రికలా కాకుండా వైసీపీ కరపత్రంలా భావించే వాళ్ళు ఎక్కువ అయ్యారు. ఆ పత్రికలో వచ్చే వార్తని జనం ఇతర పత్రికలతో పోల్చుకుని మాత్రమే నమ్మే పరిస్థితి నెలకొంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మొన్న ఈ మధ్య శ్రీశైలం జలాల అంశంలో, ఇప్పుడు అమరావతికి ప్రపంచ బ్యాంకు ఋణం విషయంలో మాత్రం సాక్షి వైసీపీ కి తీరని నష్టం చేసింది.
శ్రీశైలం జలాల్ని ఏపీ సర్కార్ అక్రమంగా తరలిస్తోందని తెలంగాణ ఎడిషన్ లో సాక్షి రాసిన రాతలు వైసీపీ ని డిఫెన్స్ లో పడేశాయి. ఆ పార్టీ నేతలు సైతం ఈ విషయంలో సాక్షి వైఖరిని సమర్ధించలేక నానా అగచాట్లు పడ్డారు. ఇక ఇప్పుడు అమరావతి లో భూ సేకరణ , రైతుల విషయంలో సాక్షి చెప్పిన మాటకి ప్రపంచ బ్యాంకు జై కొట్టిందని ఆ పత్రిక ఘనంగా చెప్పుకుంది. కొన్ని గంటల వ్యవధిలోనే అమరావతికి రుణ మంజూరు ప్రక్రియ యధావిధిగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు ప్రకటించడంతో సాక్షికి మైండ్ బ్లాంక్ అయ్యింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న ఎన్నికల సంవత్సరంలో జగన్ కొంప కూల్చడానికి సాక్షి తప్ప వేరే ఆయుధమే అవసరం లేదని సాక్షాత్తు వైసీపీ కార్యకర్తలే కామెంట్ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించి సాక్షి ని గాడిలో పెట్టకపోతే జగన్ రాజకీయ ప్రయాణం గతి తప్పడం ఖాయం.