Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇక విపక్షం గొంతు వినపడదు. ఇదేదో అధికారపక్షం కక్షసాధింపు కాదు. సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్ తన శాసన సభ్యులతో కలిసి చర్చించి తీసుకున్న నిర్ణయం ఇది.
వైసీపీ తరపు గెలిచి టీడీపీ లోకి ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలు, మంత్రులుగా వున్న నలుగురి మీద వేటు వేసేదాకా అసెంబ్లీలోకి అడుగుపెట్టకూడదని జగన్ అండ్ కో తీసుకున్న నిర్ణయంలో ఔచిత్యం ఏమిటో అర్ధం కాలేదు. ఓ వైపు ఈ వ్యవహారంలో న్యాయపోరాటం చేస్తామంటూనే ఇప్పుడిలా అసెంబ్లీ మీద అలగడం లో అర్ధం ఏముంది ?
నిజానికి ఆంధ్రప్రదేశ్ లో విపక్షం, అధికార పక్షం మధ్య పరిస్థితి ఉప్పునిప్పులా వుంది. అలాంటి స్థితిలో టీడీపీ తమ డిమాండ్ తీర్చదని వైసీపీ కి బాగా తెలుసు. అయినా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ వ్యూహం వుంది. ఇప్పుడు అసెంబ్లీకి వెళితే అధికార పక్షాన్ని జగన్ తిట్టకుండా ఉండలేరు. ఆయన ఒకటి అంటే అధికార పక్షం నాలుగు అంటుంది. పైగా నంద్యాల ఉపఎన్నికల ఫలితం వచ్చాక జగన్ ని నేరుగా ఆడుకునే అవకాశం టీడీపీ కి ఇప్పుడు వచ్చింది. ఆ ఛాన్స్ తీసుకోకుండా ఉండేందుకు జగన్ అసలు అసెంబ్లీకి ఎగనామం పెడుతున్నారు. నిజానికి ప్రజాస్వామ్యంలో స్ఫూర్తి ప్రజల పక్షాన విపక్షం గొంతుక సభలో వినిపించడం. దాన్ని నొక్కడానికి అధికార పక్షం చేసే ప్రయత్నాల్ని అడ్డుకోవాల్సింది పోయి తామే ఎదురెళ్లి ఆ అవకాశం వదులుకోవడం అంటే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమే.