ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. నిన్నమొన్నటిదాకా సీఎం చంద్రబాబుని ప్రధానంగా టార్గెట్ చేసుకుంటూ వచ్చిన జనసేన అధినేత పవన్ కొంత కాలంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ ని కూడా ఏకిపారేస్తున్నారు. దానికి కౌంటర్ గా జగన్ సైతం పవన్ మీద ఘాటుగా విమర్శలు సాగిస్తున్నారు. తాజాగా భార్యల్ని మార్చడం మగతనం అవుతుందా అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలతో వాతావరణం మరింత వేడెక్కింది. సీఎం చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ ఇద్దరు ఇలా ముఖాముఖీ తలపడడం వెనుక లోగుట్టు ఏమై ఉంటుంది ? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ చిన్న విశ్లేషణ.
సీఎం చంద్రబాబు ఓటమి లక్ష్యంగా ఇటీవల వరకు జగన్ , పవన్ పావులు కదిపారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి పని చేస్తే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం సులభం అని ఇద్దరికీ సన్నిహితులు అయిన వాళ్ళు సూచించారు. ఆ సూచనకు అనుగుణంగా ఇటీవల కొన్ని ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది.
రెండు పార్టీల అగ్రనేతల మధ్య ఓ రహస్య సమావేశం కూడా జరిగినట్టు సమాచారం వుంది. అయితే ఆ సమావేశమే ఇప్పుడు ఇద్దరి మధ్య అగాధానికి కారణం అని తెలుస్తోంది. పొత్తుల విషయంలో రెండు పార్టీలు సుముఖంగా ఉన్నప్పటికీ సీట్లు విషయంలో ఒకరి లెక్కలు ఇంకొకరికి ఏ మాత్రం నచ్చేలా లేవట. వైసీపీ ఆఫర్ అవమానకరంగా భావించిన పవన్ ఇప్పుడు జగన్ ని కలిపి విమర్శలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి జగన్ కౌంటర్ ఇవ్వడం వెనుక కూడా ఓ రాజకీయ కోణం , వ్యూహం వున్నాయి. గోదావరి జిల్లాల్లో టీడీపీ ఆధిపత్యానికి చెక్ పెట్టాలంటే ఏదో విధంగా ఆ పార్టీ అనుకూల ఓట్ బ్యాంకు చీలాలని జగన్ భావిస్తున్నారు. ఆ పనిని తన కన్నా పవన్ బాగా చేయగలరు అని ఆలోచించే పవన్ ని స్వతంత్రంగా పోటీ చేసేలా రెచ్చగొడుతున్నారు. ఇక ఈ ఇద్దరి ధోరణిలో వచ్చిన మార్పుల్ని సీఎం చంద్రబాబు గమనిస్తున్నారు. దానికి విరుగుడు వ్యూహాల్ని రచిస్తున్నారు.