ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఢిల్లీలో ఈరోజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మీరు అధికారంలోకి వస్తే అప్పుడు కేంద్రంలో రాహుల్ గాంధీ పీఎం అయితే ఎవరికి మద్దతిస్తారన్న ప్రశ్నకు హోదా ఇస్తామంటే రాహుల్ గాంధీకి మద్దతిస్తాం అలాంటి విషయంలో ఎలాంటి సందేహం లేదు అంటూ తెగేసి చెప్పారు జగన్. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందా? బలహీనంగా ఉందా? మీరు ఎలా ఉందని భావిస్తున్నారు? అన్న ప్రశ్నకు నవ్వుతూ జగన్ సమాధానమిచ్చారు. అయితే జాతీయ రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీది తటస్థ వైఖరని ఏపీకి హోదా ఇచ్చేవారికే తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని వెల్లడించారు. ఇండియా టుడే 18వ ఎడిషన్ కాంక్లేవ్‌లో భాగంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడారు. సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ కన్వల్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. రాష్ట్ర రాజకీయాలు, లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. తన తొమ్మిదేళ్ల రాజకీయ ప్రయాణమంతా ప్రజల మధ్యలోనే గడిచిందని వైఎస్ జగన్ తెలిపారు.
‘ఏ దారిలో నడుస్తున్నా.. ఎక్కడ ఉంటున్నా.. ప్రజలకు సమాచారం ఇస్తూ.. వారితో కలిసి నడిచా. వీలైనంత ఎక్కువ మంది ప్రజలను కలుసుకున్నా. పాదయాత్ర ద్వారా 14 నెలలు ప్రజల మధ్యలోనే ఉన్నా. పాదయాత్ర పొడుగునా ప్రజల కష్టసుఖాలు వింటూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ.. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇస్తూ వచ్చా. అన్ని వర్గాల వారి సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రజలకు సంక్షేమ పాలన అందించాలన్నది నా లక్ష్యం’ అని జగన్ అన్నారు. జాతీయ స్థాయిలో ఉన్న రెండు ప్రధాన పార్టీలూ ఏపీని మోసం చేశాయని జగన్ అన్నారు. ఏపీ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ వెన్నుపోటు పొడిచాయన్నారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రాన్ని విభజించారని, విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని పేర్కొన్నారు.