Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మనకు ఓ మనిషితో అవసరం పడితే అడిగి చూస్తాం. పని కాదనుకుంటే ఇంకాస్త బతిమాలి చూస్తాం. అప్పటికీ మ్యాటర్ సెటిల్ కాకుంటే ఇంకో రకంగా ఆ మనిషిని మెప్పించి పని చేసుకోడానికి ప్రయత్నిస్తాం. మనిషి విషయంలో అయినా రాజకీయ పార్టీ విషయంలో అయినా పద్ధతి ఇదే. వైసీపీ అధినేత జగన్ తాను ఇందుకు అతీతం అనుకుంటున్నారో లేక తెలివితేటలు ఎక్కువ అనుకుంటున్నారో గానీ ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని క్రియాశీలం చేద్దాం అనుకున్నప్పటినుంచి ఆ పార్టీ తో పొత్తు కోసం వైసీపీ వెంపర్లాడుతోంది. ప్రత్యేక హోదా సహా వివిధ అంశాలను ప్రాతిపదిక చేసుకుని కలిసి పని చేద్దామని జనసేనకు వైసీపీ నేతలు ఎన్నో సందర్భాల్లో పిలుపు ఇచ్చారు. ఓ వైపు పవన్ ని చంద్రబాబు సన్నిహితుడుగా ముద్ర వేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఇంకో వైపు ఆయన్ని వైసీపీ కి దగ్గర చూసేందుకు ట్రై చేశారు. ఇలా ప్రయత్నించిన వైసీపీ నేతల్లో జగన్ కి అతి సన్నిహితుడు అని చెప్పుకునే విజయసాయి రెడ్డి ఒకరు.
2014 ఎన్నికల ముందు నుంచి వైసీపీ, జగన్ వైఖరిని పవన్ అంగీకరించడం లేదు. తాజాగా విశాఖ పర్యటనలోనూ తండ్రి చనిపోయిన వెంటనే పదవులు కోసం వెంపర్లాడిన జగన్ కి సీఎం కుర్చీలో ఎక్కే అనుభవం ఎక్కడ ఉందని పవన్ పరోక్షంగా జగన్ ని టార్గెట్ చేశారు. దీంతో 2019 ఎన్నికల్లోనూ జగన్ ని పవన్ రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తున్నారు అని చెప్పుకోవచ్చు. నిజాలు అలా ఉంటే వాటిని మసిపూసి మారేడుకాయ చేయడానికి వైసీపీ అధినేత జగన్ తన సాక్షి ఛానల్ సాయంతో చేసిన ఇంటర్వ్యూ ఎపిసోడ్ పెద్ద కామెడీ అయిపోయింది. విశాఖ టూర్ లో తాను వైసీపీ తో విభేదిస్తున్నట్టు పవన్ మాటలతో అర్ధం అయినప్పటికీ ఆయనతో పొత్తు కుదిరితే చాలని జగన్ తహతహలాడుతున్న విషయం ఈ ఎపిసోడ్ తో అర్ధం అయ్యింది. పాదయాత్ర మధ్యలో సాక్షి ఛానల్ కోసం జగన్ ని కొమ్మినేని చేసిన ఇంటర్వ్యూ లో ఓ ప్రశ్న అడిగారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుంటారా అని . ఈ ప్రశ్న చూస్తే పొత్తు కోసం రెండు వైపులా ప్రయత్నాలు జరుగుతున్నట్టు , జనసేన ని ఒప్పుకునే పరిస్థితిలో వైసీపీ ఉన్నట్టు కలరింగ్ ఇచ్చారు.
కొమ్మినేని ప్రశ్న పెద్ద కామెడీ అనుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన జగన్ అంతకన్నా పెద్ద కామెడీ చేశారు. “పవన్ తో నాకు పరిచయం లేదు . అయినా ఆయన ముందు చంద్రబాబు ప్రభావం నుంచి బయటకు రావాలి “ అని జగన్ సమాధానం చూస్తుంటే తానే పవన్ వెంటపడి తానే షరతు పెడుతున్నట్టు అర్ధం అయిపోతోంది. కింద పడ్డా పై చేయి నాదే అనే జగన్ వైఖరి చూసి పవన్ మాత్రమే కాదు ఏ రాజకీయ పార్టీ పొత్తుకు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. మాటలతో గారడీ చేస్తేనో, తాను జీతం ఇచ్చే ఉద్యోగితో ప్రశ్నలు అడిగించుకుంటేనో పరిస్థితి మారదు. ఈ నిజాన్ని జగన్ ఎంత త్వరగా గ్రహిస్తే వైసీపీకి అంత మేలు.