Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎట్టకేలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర తెరకెక్కేందుకు రంగం సిద్ధమయింది. 2009 సెప్టెంబర్ 2న కర్నూల్ జిల్లా పావురాలగుట్టలో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం చెందిన దగ్గరనుంచి ఆయన జీవితం ఆధారంగా సినిమా తీసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కొంతమంది దర్శకులు సినిమా ఎనౌన్స్ కూడా చేశారు. కానీ ఏ కారణాలవల్లో ఆ ప్రాజెక్టులేవీ పట్టాలెక్కలేదు. ఇన్నాళ్లకు ఆనందోబ్రహ్మ దర్శకుడు మహి. వి. రాఘవన్ వైఎస్ జీవితాన్ని వెండితెరపై చూపించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ సినిమాకు యాత్ర అనే టైటిల్ ఖరారుచేశారు. వైఎస్ రాజకీయ జీవితంలో ఆయన చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్ర కీలకమలుపు. ఆ యాత్రద్వారానే వైఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం కాగలిగారు. వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురాగలిగారు.
బహుశా ఆ స్ఫూర్తితోనే యాత్ర అనే టైటిల్ ఖరారు చేసుండొచ్చు. యాత్రలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. వైఎస్ తో కాస్త దగ్గరి పోలికలు ఉండే మమ్ముట్టి… మేకప్ వేస్తే… అచ్చం వైఎస్ లా కనిపించే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలో నటించడానికి మమ్ముట్టి ఓ కండీషన్ పెట్టారు. తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకునే వీలుంటేనే నటిస్తానని మమ్ముట్టి షరతువిధించారు. అందుకు చిత్రయూనిట్ అంగీకరించింది. మమ్ముట్టికి తెలుగు బాగానే వచ్చు… చాన్నాళ్ల క్రితమే… స్వాతికిరణం సినిమా కోసం ఆయన సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. గంభీరంగా ఉండే ఆయన వాయిస్… ఆ పాత్రకు బాగా సూటయింది. ఇప్పడు వైఎస్ కు కూడా… ఆయన గొంతు బాగానే నప్పుతుందని చిత్రయూనిట్ అంటోంది. ఇక యాత్ర సినిమాలో ఇతరక్యారెక్టర్లకు కూడా పర భాషా నటీనటులనే ఎక్కువగా తీసుకుంటున్నారు. మే నుంచి సినిమా షూటింగ్ మొదలుకానుంది. వందరోజుల్లో సినిమా పూర్తిచేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. వైఎస్ బయోపిక్ తెరకెక్కించడానికి ఆయన కుమారుడు, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరించినట్టు సమాచారం.