వైకాపాతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని అవినీతి పరులతో మేము కలవం అని ఒకవర్గం భాజపా నేతలు చెబుతారు. మరో వర్గం జగన్ మీద ఉన్నవి కేవలం అభియోగాలు మాత్రమే ఇంకా నిరూపితం అవలేదని మరో వర్గం అంటుంటారు. మరో పక్క తాము సొంతంగానే ఎన్నికలకు వెళ్తామని పొత్తుల సంగతి దేవుడెరుగు అని జగన్ కూడా ఏపీలో ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఈ రెండు పార్టీల మధ్య రహస్య స్నేహం కుదిరిపోయిందన్న ఆరోపణలు తెలుగుదేశం ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తోంది. అయితే ఇప్పుడు వాటికి మరో అంశం మరింత బలం చేకురుస్తోంది. అదే వైకాపా ఎంపీల రాజీనామాల ఆమోద ప్రక్రియ ! రాజీనామాలు చేసిన మొదలు, ఆమోదించినంత వరకూ జరిగిన తీరును జాగ్రత్తగా పరిశీలిస్తే వారి రహస్య బంధం సామాన్యులకి కూడా అర్ధం అవుతోంది.
అసలు వైకాపా ఎంపీలు రాజీనామా చేసిందే ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం, తద్వారా ఉపన్నికలకి వెళ్లి తెలంగాణా రాక ముందు టీఆరెస్ ఎలా అయితే ఉద్యమ స్పూర్తిని రగిలించిందో అదే విధంగా చేస్తామని వారు ప్రకటించారు. కానీ, వారికి అప్పటికే ఉప ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో రావనేది భాజపా ద్వారా తెలిసింది. అసలు సాంప్రదాయం ప్రకారం రాజీనామా చేసిన వెంటనే స్పీకర్ ఓసారి పిలిచి దానికి కారణం తెలుసుకోవాలి. కానీ రాజీనామా చేసి వెంటనే నిరాహారదీక్ష అంటూ వారు అందుబాటులో లేకుండా పోయారు. చాలా రోజుల తర్వాత స్పీకర్ వారిని కలిసి పునరాలోచన చేయమంటూ మరో వారం సమయం ఇచ్చారు. అప్పటికీ అంతిమ నిర్ణయం ప్రకటించకుండా ఎప్పుడో ఏప్రిల్ లో రాజీనామాలు చేస్తే, జూన్ 20 వరకూ స్పీకర్ తీరుబడి లేదన్నట్టుగా ఇప్పుడు ఆమోదించారు (ఇదే తరహాలో రాజీనామా చేసిన యడ్యూరప్ప, శ్రీ రాములు రాజీనామాలు వెనువెంటనే ఆమోదించడం తెలిసిందే)
ఇక్కడ వైకాపా, బీజేపీ ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నాయి అనే చెప్పాలి ఎందుకంటే, ఎంత ప్రత్యేకా హోదా ఉద్యమం పేరు చెప్పుకుని జనాల్లోకి వెళ్ళినా వైకాపాకి ఈ ఉప ఎన్నికలకు అనవసర ప్రయాస అనేది అర్ధం అవుతోంది. ఒకవేళ ఉప ఎన్నికలకు వెళ్లి ఆ ఐదు స్థానాలు తిరిగి గెలుచుకున్నా ప్రత్యేక హోదా సాధన కోసం ఆ ప్రక్రియ ఏ విధంగా పనికొస్తుందో వారికే తెలీదు, అది కాక పొరపాటున ఒకటో రెండో స్థానాలు ఓడిపోయారే అనుకోండి టీడీపీకి అంతకంటే చాన్స్ మరోటి ఉంటుందా ? ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్ కి గ్రాఫ్ ఏ లేదు అని ప్రచారం చేస్తారు. సో ఉప ఎన్నికలకి వెళ్లి ఐదింటికి ఐదూ సాధించినా ఫలితం లేదు అదే ఒకటీ రెండో చేజారితే మూలిగేనక్క మీద తాటికాయ పడ్డట్టు అవుతుంది.
అదే ఇప్పుడయితే ఎంచక్కా మేము రాజీనాలు చేసాం స్పీకరు ఆమోదించలేదు ఇప్పటిదాకా అని చెప్పుకోవచ్చు. అంటే కర్ర విరగా కూడదు పాము చావాలి అన్న చందాన. అదే ఈ అంశం భాజపాకి ఎలా ఉపయోగం అంటే నిన్న మొన్నటి దాకా అవిశ్వాస తీర్మానం ఎవరైనా పెడితే అసలుకే మొన్న పోగొట్టుకున్న సీట్లతో ఎలారా బాబు అనుకునే పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఒక వేల అవసరం అయితే వైకాపా వోటింగ్ ని వాడుకుందాం అని భావించి ఉండవచ్చు. ఇప్పుడు ఎటూ ఇంకా పది నెలల సమయమే ఉండడంతో ఇప్పుడు కాస్త లైట్ తీసుకుని ఉండవచ్చు. సో ఈ విధంగా మరో సారి వైకపా-బీజేపీ రహస్య బంధం మరో సారి బట్ట బయలు అయినట్టయ్యింది.