ఓ జాతీయ ఛానల్ 2019 లో మళ్లీ బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించబోతోందని ఓ సర్వే విడుదల చేయడం మీద తెలుగు రాష్ట్రాల్లో భారీగా జోకులు పేలుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే ఆ ఫలితాలు చూసి చంకలు గుద్దుకోవాల్సిన బీజేపీ నాయకులు కూడా సిగ్గుపడుతున్నారు. ఇంతకీ ఆ సర్వే లో బీజేపీ గెలుస్తాయని చెప్పిన 7 పార్లమెంటరీ స్థానాలు ఎక్కడని చెప్పాలో తెలియక బీజేపీ నేతలు కొందరు మీడియా కి మొహం చాటేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ పరిస్థితి అలా ఉంటే ఇక పరోక్షంగా ఆ పార్టీకి అంటకాగుతున్న వైసీపీ, జనసేన మింగలేక కక్కలేక నానా అగచాట్లు పడుతున్నాయి. అందుకు కారణం ఏంటో తెలుసా ?
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ అంటేనే మండిపడుతున్నారని వైసీపీ , జనసేనకు బాగా తెలుసు. అయినా బీజేపీ కి అనుకూలంగా వచ్చిన ఆ జాతీయ సర్వే తప్పు అని పైకి అనలేకపోతున్నారు. అంత కన్నా ఆ రెండు పార్టీలని ఇబ్బంది పెడుతున్న విషయం ఇంకోటి వుంది. బీజేపీ ఖాతాలో సదరు జాతీయ ఛానల్ చెప్పిన 7 లోక్ సభ స్థానాలు తమకి వస్తాయని సర్వే లో వెల్లడి అయినట్టే అని ఆ రెండు పార్టీల బాధ. అదే నిజం అయితే గనుక…అదే లెక్కలో చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసీపీ , జనసేన కలిపి 50 స్థానాలు దక్కించుకుంటాయి. అంటే ఇంకో సారి జగన్ అన్న కాబోయే సీఎం మాత్రమే అవుతాడు. ఇక ఆ కోవలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొత్తగా చేరిపోతాడు. మొత్తానికి ఎక్కడో స్విచ్ వేస్తే ఇంకెక్కడో బల్బ్ వెలిగినట్టు వుంది వ్యవహారం. ఆంధ్రాలో మోడీకి బూస్ట్ ఇద్దామని చేసిన ప్రయత్నం ఇప్పుడు వైసీపీ ,జనసేన కి టెన్షన్ తెప్పిస్తోంది.