వైసీపీ కౌంటర్ తో పవన్ కి సెల్ఫ్ గోల్ మ్యాటర్ అర్ధమైంది.

YSRCP counter to Pawan Kalyan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
“ వెనకటికి ఒకడు పెళ్ళికి మేళతాళాలతో పిలిస్తే వెళ్లకుండా చెంబు తీసుకెళ్లి కాస్త మజ్జిగ పోయమని అడిగాడట “… ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే వుంది. ఒకప్పుడు పవన్ తమతో కలిసి వస్తే బాగుండని వైసీపీ ఎంతో ఆరాటపడింది. జగన్ కి కుడిభుజం లాంటి విజయసాయి ఈ విషయంలో ఎన్నో సార్లు బహిరంగ విజ్ఞాపనలు చేశారు. అయినా పవన్ పట్టించుకోలేదు. పైగా జగన్ అవినీతి మీద వ్యాఖ్యలు చేశారు. అయితే ఉన్నట్టుండి వైసీపీ ఎంపీ ని పిలిపించుకుని తాను వచ్చే ఎన్నికల తర్వాత జగన్ కి మద్దతు ఇస్తానని చెప్పడమే కాకుండా టీడీపీ మీద జనసేన ఆవిర్భావ సభలో విరుచుకుపడ్డారు. ఈ సభ తరువాత వైసీపీ తనకు, తన ప్రసంగానికి రెడ్ కార్పెట్ వేస్తుందని ఆయన అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. పైగా బొత్స, అంబటి లాంటి వైసీపీ లోని కాపు నేతలే ఇన్నాళ్లు తాము చెప్పిన మాటలే పవన్ వల్లె వేశారని అంతకుమించి ఏముందని తేలిగ్గా తీసిపారేసారు.

ఇక టీడీపీ ఎటూ తమ మీద లేనిపోని ఆరోపణలు చేసిన పవన్ ని పట్టుకుని తూర్పారబడుతోంది. ఇక పవన్ సభ తర్వాత ఆయన రాజకీయ లక్ష్యం మీద కూడా అనుమానాలు వచ్చాయి. కేంద్రం మీద పోరాటం చేయాల్సిన వ్యక్తి ఇలా మొత్తం రాజకీయ వాతావరణాన్ని మార్చేందుకు ప్రయత్నించడం చూసి బీజేపీ తో కుమ్మక్కు అయ్యారని బలంగా నమ్ముతున్నారు. ఈ విషయంలో వరప్రసాద్ లాంటి వైసీపీ ఎంపీ ల వ్యాఖ్యలు పవన్ రాజకీయ నిజాయితీ మీద నీలినీడలు కమ్ముకునేలా చేశాయి. ఇక అంతకన్నా ముఖ్యమైన విషయం ఇంకోటుంది. అదే జనసేన విస్తరణ. ఈ సభ తరువాత జనసేన విస్తరణ కోసం ప్రయత్నం చేయాలని పవన్ భావించారు. కానీ ఆయన ధోరణి చూసాక ఎక్కడా అవకాశం లేని వాళ్ళు, ఆయన అభిమానులు మినహా క్షేత్ర స్థాయిలో రాజకీయ బలం వున్నవాళ్లు తొందరపడి ఆ పార్టీలో చేరే పరిస్థితి లేదు. మొత్తానికి తాను టీడీపీ తొత్తుని కాదు అని చెప్పుకోడానికి పవన్ అత్యుత్సాహం చూపి ఎవరికీ కాకుండా పోయారు. తన ప్రసంగానికి వైసీపీ ఇచ్చిన కౌంటర్ చూసాక తాను సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు కూడా పవన్ కి అర్ధం అయ్యి ఉండాలి.