టీఆర్ఎస్‌కు వైసీపీ మద్దతు.. జై జగన్…జై కేసీఆర్…!

YSRCP Extends Support To TRS Nominee In Kukatpally

తెలంగాణలో ఎన్నికల్లో దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. ప్రధాన పార్టీలతో పాటు చిన్న చిన్న కొత్త పార్టీలు కూడా ఎన్నికల కోసం కుతూహలంతో ఎదురు చూస్తున్నాయి. ఆయా పార్టీల్లో టీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ఒకడుగు ముందుందనే చెప్పాలి. అసెంబ్లీని రద్దు చేసిన రోజే 105 మంది అభ్యర్ధులను ప్రకటించి ప్రతిపక్షాల అంచనాలకు అందని కేసీఆర్ తన దూకుడు చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టే మిగతా పార్టీలు కూడా అంతే దూకుడు ప్రదర్శిస్తున్నాయి. టీఆర్ఎస్ కంటే ప్రతిపక్షాలే బాగా హడావిడి చేస్తున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం మరో రెండు పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పాటు చేశాయి. అలాగే భారతీయ జనతా పార్టీ, మజ్లీస్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నాయి. వీటితో పాటు పది చిన్న పార్టీలతో బహుజన ఫ్రంట్ ఏర్పాటు చేసిన సీపీఎం కూడా ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఇక ఈ జాబితాలో మిగిలిన పార్టీలు జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలే. ఈ రెండు పార్టీలు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించాయి. ఈ పార్టీలు పోటీ చేయకపోయినా.. ఏదో ఒక పార్టీకి మద్దతు తెలుపుతాయని అంతా అనుకుంటున్నారు.

jagan-kcr

అయితే, ఇప్పటి వరకు ఈ పార్టీల నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు. కానీ, హైదరాబాద్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం టీఆర్ఎస్‌కు మద్దతు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే మహాకూటమిలోని తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న కూకట్‌పల్లిలో ఆ పార్టీ నేతలు సమావేశం కూడా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌కు మద్దతుగా కూకట్‌పల్లిలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశం చర్చనీయాంశంగా మారింది. కూకట్ పల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి వైసీపీ నేతలు మద్దతు పలికారు. టీఆర్ఎస్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి స్థానిక వైసీపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సింహం సింగిల్ గా వస్తుందని తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ సింగిల్ గా వస్తున్నారని చెప్పారు. మహాకూటమిని ఓడించాలని కోరారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు జై కేసీఆర్, జై జగన్ అంటూ నినాదాలు చేశారు. టీఆర్‌ఎస్‌తో పాటు వైసీపీ నేతలు కూడా కష్టపడి మహాకూటమిని ఓడించాలని సమావేశంలో ప్రసంగించిన వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బ్యానర్లపై వైయస్ ఫోటో పెట్టుకోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైయస్ బొమ్మ పెట్టుకోవడానికి కాంగ్రెస్ నేతలకు అర్హత లేదని అన్నారు. వైఎస్ ను అవినీతిపరుడు, దొంగ అని కాంగ్రెస్ వాళ్లు ఆరోపించారని మండిపడ్డారు. మహాకూటమి తరపున రాహుల్ గాంధీ, చంద్రబాబులు ప్రచారానికి రాబోతున్నారని వైయస్ పై వారి అభిప్రాయం ఏమిటో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. జై కేసీఆర్, జై జగన్, జై కేటీఆర్, జోహార్ వైయస్సార్ అంటూ నినాదాలు చేశారు. దీంతో తెలంగాణా ఎన్నికల ముఖ చిత్రంలో ఇది సంచలనం అయింది. అయితే అధినాయకత్వం నుండి ఆదేశాలు అందయా ? లేదా అనే విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

jagan-resign-mps