వైసీపీ నేత పత్రికలో చంద్రబాబు భజనా?

http://telugubullet.com/wp-content/uploads/2017/06/ysrcp-leader-Mutta-Gopala-K.jpg

ముత్తా గోపాలకృష్ణ… కాకినాడ లో పేరు మోసిన వైసీపీ నాయకుడు. ఆయన కుమారుడు ముత్తా శశిధర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలైన ఆ తండ్రీకొడుకులు ఆంధ్రపత్రిక దిన పత్రిక నడుపుతున్నారు. అయితే ఎక్కడైనా బావ గానీ వంగ తోట దగ్గర బావ కాదన్నట్టు ఈ ఇద్దరికీ వ్యాపారం వ్యాపారమే… రాజకీయం రాజకీయమే. కాకినాడలో ఏ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం జరిగినా ముత్తా కుటుంబం నుంచి ఎవరో ఒకరు ముందుంటారు. సాక్షి మైక్ పట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాల్ని ఏకి పారేస్తారు. అది చూసి వైసీపీ శ్రేణులు సంబరపడిపోతుంటాయి. కానీ ఆంధ్రప్రభ అనే పత్రిక నడిపే విషయంలో వారికి వెంటనే ప్రభుత్వం ఇచ్చే యాడ్స్ గుర్తుకు వస్తాయి. అందుకే తమ పత్రిక చదివితే సీఎం కి ఎక్కడా కోపం రాకుండా జాగ్రత్తపడతారు.

ఆంధ్రప్రభ ఇవాళ్టి పత్రికలో ఆ వ్యాపార ధోరణి ఇంకాస్త స్పష్టంగా కనిపించింది. తొలి పేజీ బ్యానర్ ఐటెం గా “దార్శనికుడు… దిశా నిర్దేశకుడు ” అనే శీర్షికతో నదుల అనుసంధానం కోసం చేస్తున్న చంద్రబాబు కృషిని వేనోళ్ళ పొగుడుతూ భారీ కధనం ఇచ్చారు. ఆ పక్కనే అసెంబ్లీ లో వైసీపీ అధినేత జగన్ ఛాంబర్ లోకి నీళ్లు రావడం మీద లీకేజ్ కుట్ర అంటూ ఇంకో వార్త కి స్థానం కల్పించారు. ఇదేమిటా అని రెండో పేజీలోకి అడుగు పెట్టగానే ” అంచనాలను మించి యువనేత అడుగులు” శీర్షికతో ఇటీవల మంత్రివర్గంలోకి వచ్చిన లోకేష్ ఎంత శ్రద్ధగా,పరిణితితో తన శాఖను నిర్వహిస్తున్నారో తెలిపే కధనం కనిపించింది. దాదాపుగా పత్రిక మొత్తం ఇలాగే వుంది. ఈ ఒక్క రోజు ఆంధ్రప్రభ పత్రిక చదివి దాన్ని నడిపేది వైసీపీ నాయకుడు అంటే మాత్రం ఎవరూ నమ్మరు. ఇలాంటి వాళ్ళని పక్కనబెట్టుకుని జగన్ 2019 లో అధికారం తనదేనంటూ కలలు కంటుంటే జాలిపడటం తప్ప ఎవరు మాత్రం ఏమి చేయగలరు?