వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన విధానం ఏమిటో తాను నిర్ణయించుకోలేని స్థితిలో ఉంది. తన విధానానికి అనుగుణంగా రాజకీయ అడుగులు సైతం వేయలేని దుర్భర స్థితిలో పడిపోయింది. ఓ వైపు బీజేపీని సమర్థిస్తూ మరోవైపు ఢిల్లీలో ధర్నాలు చేయడమే దీనికి సాక్ష్యం. వంచనపై గర్జన అంటూ ఢిల్లీలో నేడు వైసీపీ దీక్ష చేస్తోంది. ఒక్క ప్రత్యేకహోదా విషయంలోనే కాదు విభజన హామీల విషయాలన్నింటిలోనూ భారతీయ జనతా పార్టీని ఒక్క మాట కూడా అనడం లేదు వైసీపీ. కొన్నాళ్ల క్రితం వరకూ బీజేపీని విమర్శించేవారు కాదు, సమర్థించేవారు కాదు. మౌనం అర్థాంగీకారం అన్న పద్దతిలో జనంలోకి వెళ్తోందన్న ఉద్దేశంతో ఏమో కానీ ఆ తర్వాత స్టాండ్ మార్చుకున్నారు. విభజన హామీల విషయంలో కేంద్రం ఇవ్వకపోవడానికి చంద్రబాబుదే తప్పనడం ప్రారంభించారు. బీజేపీ తప్పేమీ లేదు చంద్రబాబు తీసుకోలేదన్నట్లు వైసీపీ బీజేపీని వెనకేసుకొచ్చింది.
అది ఏ స్థాయికి వెళ్లిందంటే చివరికి చంద్రబాబు విభజన హామీలపై విడుదల చేసిన మొదటి శ్వేతపత్రానికి కౌంటర్‌గా జగన్ రాయించిన “బ్లాక్ పేపర్”లో బీజేపీని పూర్తి స్థాయిలో సమర్థించారు. ప్రతీ విషయంలోనూ చంద్రబాబుదే తప్పన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి రాష్ట్రాల్లోనే పెట్టుకుంటారు. ఢిల్లీలో నిరసనలు చేసేది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానే. అయితే.. విభజన హామీల విషయంలో… భారతీయ జనతా పార్టీది కానీ మోడీది కానీ తప్పేమీ లేదని బహిరంగ వాదనలు వినిపించడం ప్రారంభించిన తర్వాత ఢిల్లీలో ధర్నా చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటో ? రాజధానికి డీపీఆర్, వెనుకబడిన జిల్లాలకు నిధులు… ఇలా ఏ విషయంలో అయినా చంద్రబాబుదే తప్పని వైసీపీ ఎప్పుడో సర్టిఫై చేసింది. మరి ఇప్పుడు ఢిల్లీలో నిరసన ఎందుకు..?. తాము కేంద్రంపై పోరాడుతున్నామని ప్రజల్ని మభ్య పెట్టేందుకా..? మోడీ పేరు ఎత్తకుండా ఎవరినో నమ్మించడానికన్నట్లు అంతా చంద్రబాబే చేశారంటూ చెప్పుకోవడానికి ఢిల్లీలో గర్జన పేరుతో వంచన ఎందుకు..?