రా కస్టడీలోకి అభినందన్ !

Abhinandan

పాకిస్థాన్‌కు యుద్ద ఖైదీగా చిక్కిన ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండ్ అభినందన్ వర్ధమాన్ శుక్రవారం రాత్రి స్వదేశంలో అడుగు పెట్టారన్న సంగతి తెలిసిందే. భారత్‌ దౌత్యనీతి విజయవంతమై, ప్రపంచదేశాల ఒత్తిడికి తలొగ్గిన పాకిస్థాన్‌ ఎట్టకేలకు ఆయన్ని మనదేశానికి అప్పగించింది. వాఘా సరిహద్దు వద్ద ఆయనకు సైన్యంతో పాటు అనేక ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు ఘనస్వాగతం పలికారు. శత్రు దేశానికి చిక్కి బయటపడిన అభినందన్ సామాన్య జీవితం గడిపేందుకు కొద్దిరోజులు పడుతుందని ఐఏఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే పాకిస్థాన్ సైన్యం చేతిలో మూడు రోజుల పాటు బందీగా ఉన్న ఆయన ద్వారా జాతీయభద్రత, దేశ రహస్యాలు బయటకు పొక్కే అవకాశాలున్న నేపథ్యంలో అనేక పరీక్షలు నిర్వహిస్తామని సైన్యం చెబుతోంది. పాక్‌‌లో బందీగా గడిపిన సమయంలో ఆయన్నుంచి దేశ రహస్యాలేమైనా శత్రు దేశం తెలుసుకుందా?, తనకు తెలియని స్థితిలో అభినందన్‌ ఏవైనా చెప్పకూడని విషయాలేమైనా చెప్పేశారా ? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఆయనకు ఐదు రకాల పరీక్షలు చేస్తారని రక్షణ రంగ అధికారులు చెబుతున్నారు.

ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న ప్రతి సైన్యాధికారికి ఈ పరీక్షలు తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. ఆయన శత్రువులకు ఎలా పట్టుబడ్డారు? అనే విషయం నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేవరకు చోటుచేసుకున్న ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్లు తెలుసుకుంటారట. ఆయన శారీరక సామర్థ్యం తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే అభినందన్ శరీరంలో పాకిస్థాన్‌ సైన్యం ఏమైనా చిప్స్‌ లాంటివి చొప్పించిందా? అనేది తెలుసుకోవడానికి పూర్తిగా స్కానింగ్‌ చేస్తారు.ఔషధాలు ప్రయోగించి దేశరహస్యాలేమైనా రాబట్టారా?, హింసించి జాతీయభద్రతకు సంబంధించిన సున్నిత అంశాలు తెలుసుకున్నారా? తదితర విషయాలు తెలుసుకునేందుకు సైకలాజికల్‌ పరీక్షలు నిర్వహిస్తారట. దేశభద్రతకు సంబంధించిన నిఘావర్గాలు(ఐబీ), గూఢచారి విభాగం(రా) అధికారులు అభినందన్‌ను ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. సాధారణంగా తమ అధికారిని ఐబీ, రా ప్రశ్నించడానికి ఐఏఎఫ్‌ అంగీకరించదు. అభినందన్‌ విషయంలో ఇది అసాధారణ అంశం కాబట్టి అంగీకరించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.