ఓ హత్య కేసులో కుటుంబ సభ్యులు జైలుకెళ్లారు.. ఆ కుటుంబానికి సంబంధించిన పెంపుడు కుక్క మాత్రం ఇంట్లోనే ఉంది. కుక్క సంరక్షణను చూసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కానీ మానవత్వంతో పోలీసులే ముందుకొచ్చి ఆ కుక్క సంరక్షణను చూసుకుంటున్నారు. మధ్యప్రదేశ్ బినా పట్టణంలోని చోటీ బజరాయి పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవలే ఓ హత్య జరిగింది. ఆస్తి వివాదాల నేపథ్యంలో మనోహర్ అహిర్వార్, ఆయన కుమారులిద్దరూ దగ్గరి బంధువులైన ఐదుగురిని దారుణంగా హత్య చేశారు. మృతుల్లో పదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు.
ఈ హత్య కేసులో మనోహర్‌తో పాటు కుమారులిద్దరికి కోర్టు జైలు శిక్ష విధించింది. దీంతో మనోహర్ పెంపుడు కుక్క సుల్తాన్ ఒంటరిగా ఉండిపోవాల్సి వచ్చింది. అయితే కుక్క సంరక్షణను చూసుకునేందుకు బంధువులు కానీ, ఇరుగుపొరుగు వారెవరూ ముందుకు రాలేదు. దీంతో పోలీసులే కుక్కను స్టేషన్‌కు తీసుకెళ్లి.. దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.
ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. మనోహర్‌ను అరెస్టు చేయడానికి వెళ్తే.. తమపై దాడి చేసేందుకు కుక్క యత్నించిందని తెలిపారు. ఇప్పుడు మాత్రం ఆ శునకం తమతో కలిసిపోయిందని చెప్పారు. ప్రతి రోజు కుక్కకు పాలు, ఆహారంతో పాటు స్నానం చేయిస్తున్నామని పేర్కొన్నారు. పోలీసుల గదిలోనే కుక్క కూడా విశ్రాంతి తీసుకుంటుందని తెలిపారు.