Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్రప్రభుత్వంపైనా, ప్రధాని మోడీపైనా ఇటీవల తరచుగా విమర్శలు చేస్తున్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోమారు బీజేపీ లక్ష్యంగా తన అసహనం వ్యక్తంచేశారు. ఈ సారి ఆయన హిందుత్వం-జాతీయత ఒక్కటే అన్న కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుని తన ఆగ్రహం ప్రదర్శించారు. హిందుత్వం-జాతీయత ఒక్కటే అని చెబుతున్న మంత్రి ఆ మాటకు అర్ధం కూడా వివరిస్తే బాగుంటుందని ట్విట్టర్ లో మండిపడ్డారు ప్రకాశ్ రాజ్. ఇస్లాం మతాన్ని ప్రపంచంలోనే లేకుండా చేయాలని సదరు మంత్రి భావిస్తున్నారేమోనని అనుమానం వ్యక్తంచేశారు.
అంబేద్కర్, అబ్దుల్ కలాం, అమృత పీతమ్, డాక్టర్ కురియన్, రెహ్మాన్, కుష్వంత్ సింగ్ వీరంతా ఎవరని ఆయన నిలదీశారు. దేశంలో తనలాగా మతాన్ని కాకుండా మానవత్వాన్ని నమ్మేవారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అసలు కేంద్రప్రభుత్వ ఎజెండా ఏమిటన్న ఆయన…పునర్జన్మను నమ్మే మీరంతా నియంత హిట్లర్ కు ప్రతీకలా అని ప్రశ్నించారు. హిందుత్వం- జాతీయత ఒక్కటే అయినప్పుడు అసలు మతం విషయాన్ని లేవనెనత్తడం ఎందుకన్నారు. భారత్ లౌకికవాద దేశమని, ఈ సిగ్గులేని రాజకీయాలతో దేశానికి ఒరిగేది ఏంటని ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జర్నలిస్ట్ గౌరీలంకేశ్ హత్య కేసులో తొలిసారి ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్ అప్పటినుంచి కేంద్ర ప్రభుత్వ విధానాలను, బీజేపీ నేతల వైఖరిని వీలుచిక్కినప్పుడల్లా విమర్శిస్తున్నారు.