డీజే దువ్వాడ జగన్నాధం తెలుగు బులెట్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ

Allu Arjun DJ Duvvada Jagannadham Movie Review video

చిత్రం: దువ్వాడ జగన్నాధం
తారాగణం: అల్లుఅర్జున్, పూజ హెగ్డే, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: సందీప్ ఛటర్జీ
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: హరీష్ శంకర్

అల్లు అర్జున్, హరీష్ శంకర్, దిల్ రాజు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన డీజే ఉరఫ్ దువ్వాడ జగన్నాధం మొదటి నుంచి టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. దీనికి ఎన్నో కారణాలున్నాయి. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్రాహ్మణ కుర్రోడుగా కనిపించడం మొదటినుంచి ఓ ఆసక్తి రేపింది. ఇక దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో వస్తున్న 25 వ సినిమా కావడం, బన్నీ, దేవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం తో డీజే మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్టు డీజే సినిమా వుందో, లేదో ఇప్పుడు చూద్దాం.

దువ్వాడ జగన్నాధం కథ… 

దువ్వాడ జగన్నాధం (అల్లు అర్జున్) ఓ ప్యాలస్ లో వంటవాడిగా పనిచేస్తుంటాడు. ఆ ప్యాలస్ లో జరిగే పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్స్ బాధ్యతలు చూస్తుంటాడు. ఇలా తన పని తాను చేసుకునే అతనికి అనుకోకుండా పూజ హెగ్డే పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. ఆ ప్రేమకథ అనుకోని మలుపు తిరిగేలోపు హీరో మీద ఇంకో బాధ్యత పడుతుంది. ప్యాలస్ కి సంబంధించి కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు బ్రాహ్మణులకి చెందాల్సి ఉంటుంది. అయితే వాటిపై కన్నేసిన రొయ్యలనాయుడు తనకు తోచిన పద్ధతిలో దాన్ని ఆక్రమించుకోడానికి ప్రయత్నిస్తాడు. బ్రాహ్మణులకి చెందాల్సిన ఆ ఆస్తుల కోసం విదేశాల నుంచి కూడా ఓ ముఠా రంగంలోకి దిగుతుంది. వారి నుంచి ఆ ఆస్తిని కాపాడుకోడానికి డీజే యుద్ధం ప్రారంభిస్తాడు. అందులో భాగంగా విదేశాలు వెళ్లిన అతనికి అసలు విలన్ ఎవరో తెలుస్తుంది. అది డీజే కి షాకింగ్ గా అనిపిస్తుంది. తేరుకున్న డీజే ఆ విలన్ మీద ఎలా పై చేయి సాధించాడు? చివరికి కథ ఎలా ముగిసింది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ…

ఎన్ని మంచి సినిమాలు చేసినా ఓ కమర్షియల్ సినిమా సాధించే విజయం ఎప్పుడూ స్పెషల్ గా అనిపిస్తుంది. అందుకేనేమో దిల్ రాజు హరీష్ శంకర్, బన్నీ కాంబినేషన్ సెట్ చేసాడు. దీనికి ముందు రామయ్య వస్తావయ్యా, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాల తర్వాత మరోసారి హరీష్ టాలెంట్ మీద నమ్మకంతోనే దిల్ రాజు డీజే ప్లాన్ చేసాడు. ఆ నమ్మకాన్ని హరీష్ పూర్తి స్థాయిలో నిలబెట్టుకున్నాడు. సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉండేలా కథ, కధనాలు రేసు గుర్రంలా పరిగెత్తాయి. ఓ వైపు మనసారా నవ్వించే కామెడీ, ఇంకోవైపు ఊహకందని ట్విస్ట్ లతో కథని నడిపిన తీరు అమోఘం. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ లవ్ ఎపిసోడ్ మిమ్మల్ని సీట్ లో కుదురుగా కుర్చోనివ్వకుండా నవ్విస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో మలుపులు సినిమా మీద ఇంటరెస్ట్ ఇంకాస్త పెంచేస్తాయి. రొటీన్ కి భిన్నమైన క్లైమాక్స్ లో చేజింగ్ సీన్ అదిరిపోతుంది. అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. బ్రాహ్మణ యువకుడి పాత్ర లో డైలాగు డెలివరీ కూడా తగినట్టు వుంది. అదుర్స్ లో ఎన్టీఆర్ తో పోల్చుకుంటే తప్ప ఆ క్యారెక్టర్ బాగా చేసాడు. ఇక డాన్స్ లు ఎప్పటిలాగానే అదరగొట్టాడు. పూజ హెగ్డే కూడా అందిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంది. ఇక రొయ్యలనాయుడు పాత్రలో రావు రమేష్ అదరహో అనిపించాడు. ఈ సినిమా తర్వాత అతని రేంజ్ ఇంకా పెరుగుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

ప్లస్ పాయింట్స్ …

కథ, కధనం
ఫస్ట్ హాఫ్ కామెడీ
లవ్ ఎపిసోడ్
డీజే , రొయ్యల నాయుడు పాత్రలు
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ …

సెకండ్ హాఫ్ లో తగ్గిన వినోదం
అక్కడక్కడా లాగ్స్

తెలుగు బులెట్ పంచ్ లైన్ –  డీజే దుమ్ము రేపాడు.
తెలుగు బులెట్ రేటింగ్ –  3 /5 .