Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుంటూరు జిల్లా దాచేపల్లి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అరాచకాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టిచ్చిన వారికి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితుడిని అరెస్ట్ చేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు. నిందితుడి ఇంటిని ధ్వంసం చేశారు. ఈ దారుణాన్ని నిరసిస్తూ దాచేపల్లిలో స్వచ్ఛంద బంద్ పాటిస్తున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయంచేయాలని డిమాండ్ చేస్తూ జీజీహెచ్ ఎదుట సీపీఐ, సీపీఎంతో పాటుప్రజా, మహిళాసంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని, అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ఉరితీయాలని డిమాండ్ చేశారు.
అత్యాచార బాధితురాలికి గుంటూరు సర్వజనాసుపత్రిలో వైద్యచికిత్స అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ బాధిత బాలికను పరామర్శించారు. మెరుగైన వైద్యసదుపాయం కల్పించాలని ఆదేశించారు. ఈ ఘటన దురదృష్టకరమని, నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోక్సో చట్టం కింద చిన్నారి కుటుంబానికి పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి…గ్రామగ్రామానా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పారు.