నరేంద్రమోడీ పర్యటన తమ చేతకాని తన వలన వాయిదా పడిందన్న బాధ భాజపార్టీ కార్యకర్తల్లో ఎక్కువగానే ఉన్నట్లుగా ఉంది. కాకినాడలో జన్మభూమి కార్యక్రమలో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాల్లో అవినీతి జరుగుతోందంటూ ముఖ్యమంత్రి కాన్వాయ్ ను బీజేపీ నేతలు ఈరోజు అడ్డుకున్నారు. కాకినాడ జేఎన్టీయూలో జరుగుతున్న ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమానికి సీఎం వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు నేతలు, చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తొలుత ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు యత్నించారు.
అయితే ఆందోళనకారులు ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో ఆయన సహనం కోల్పోయారు. మీరు ఈ రాష్ట్రంలో పుట్టలేదా ? రాష్ట్రానికి మోడీ ఏం చేశారు ? రాష్ట్రంలో ఉండేందుకు బీజేపీ నేతలకు అర్హత లేదన్నారు. రాష్ట్రానికి మోడీ చేసిన అన్యాయాన్ని మీరు సమర్థిస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని, దేశాన్ని మోదీ ముంచేశారని ‘కొంచమైనా సిగ్గు ఉందా మీకు? నన్ను డౌన్ డౌన్ అనడం కాదయ్యా. మీ అందరినీ జనాలు తరిమికొడతారు. లేనిపోని సమస్యలు పెట్టుకోవద్దు. మీరు ఫినిష్ అయిపోతారు. నిన్న కూడా తెలుగువాళ్ల మీద ఢిల్లీలో లాఠీచార్జ్ చేయించారు. ఈ గడ్డపై ఉంటూ, ఇక్కడి నీళ్లు తాగుతూ, ఇక్కడి గాలిని పీలుస్తున్నప్పుడు కమిట్ మెంట్ ఉండాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హద్దు దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.