పండుగ రోజు కూడా చంద్రబాబు తిత్లీ తుపాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రజల మధ్యే ఆయన పండుగ చేసుకుంటున్నారు. ఈ ఉదయం పలాస రైల్వే స్టేషన్ మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో చంద్రబాబు పాల్గొనగా, బ్రాహ్మణి అక్కడికి వచ్చి పూజల్లో పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు, బ్రాహ్మణిలకు పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
రాష్ట్ర మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడులతో పాటు ప్రత్తిపాటి పుల్లారావు, కళా వెంకట్రావు, పలువురు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు.
అయితే ఈ ఉత్సవాల కార్యక్రమం పూర్తయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిత్లీ తుపాన్ బాధితులను ఆదుకునే బాధ్యత కేంద్రానికి ఉందా లేదా? అని ప్రశ్నించారు. బాధితులను పరామర్శించేందుకు కేంద్రం నుండి ఒక్కరు కూడా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయాలే ముఖ్యమా అని సీఎం ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తోందని విమర్శించారు. బీజేపీ కార్యాలయ శంకుస్థాపనకు గుంటూరు వచ్చిన రాజ్‌నాథ్ సింగ్ శ్రీ కాకుళం రాకుండానే వెళ్లిపోయారని ఒక పక్క రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే శంకుస్థాపనలకు ఇది సమయమా? అని ఆయన విమర్శించారు.