ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ రాధాకృష్ణకు జగ్గయ్యపేట కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. అసత్య వార్తలు ప్రచురించారని ఆరోపిస్తూ జగ్గయ్యపేటకి చెందిన ముత్యాల సైదేశ్వరరావు పత్రిక ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాస్‌లపై గతంలో పరువునష్టం దావా వేశారు. అయితే కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి పలుమార్లు నోటీసులు జారీచేసినా వారు హాజరుకాలేదు. దీంతో రాధాకృష్ణ, శ్రీనివాస్‌ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు నిన్న వారిద్దరికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. నిజానికి రెండేళ్ల క్రితం సైదేశ్వరరావు ఓ భూమిని కొనుగోలు చేసి రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. అయితే దీనిపై ఆంధ్రజ్యోతి పత్రికలో ఓ కథానాన్ని ప్రచురించారు. ఆ కథనం పూర్తిగా అసత్యమైనదని ఆరోపిస్తూ సైదేశ్వరరావు జగ్గయ్యపేట కోర్టును ఆశ్రయించారు. ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాస్, జిల్లా ఇన్ఛార్జ్ మాధవి, స్థానిక విలేకర్లు వెంకట రమేష్, నాగేశ్వరరావు, అదే విధంగా తప్పుడు ప్రకటన చేసిన నారాయణం, కృష్ణారావులపై పరువునష్టం కేసు వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా వారందరూ కోర్టుకు హాజరుకావాల్సింది న్యాయమూర్తి అనేక సార్లు నోటీసులు జారీ చేశారు. అయినా కూడా వారు వాయిదాలకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్‌ను జారీచేసింది. వారెంట్‌ను రద్దు కోరుతూ.. రాధాకృష్ణ తరఫు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా న్యాయమూర్తి దానిని తిరస్కరించారు.