Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటూ ఏపీ ఎంపీలు నాలుగురోజులుగా చేస్తున్న ఆందోళనలు, ఏపీ బంద్ వంటి పరిణమాలేవీ కేంద్రప్రభుత్వ వైఖరిలో మార్పు తేలేదు. ప్రధాని ప్రసంగం నిరాశపర్చినా… హామీల అమలు విషయంలో ఆర్థికమంత్రి స్పష్టమైన ప్రకటన చేస్తారని ఎదురుచూసిన ఏపీ ప్రజలను కేంద్రం మరోసారి తీవ్రంగా నిరుత్సాహ పరిచింది. కేంద్రబడ్జెట్ పై అరుణ్ జైట్లీ ప్రసంగం మొదలుపెట్టగానే ఏపీ ఎంపీలు ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. ఏపీకి ఇచ్చిన హామీలపై మాట్లాడిన తర్వాత ప్రసంగం మొదలుపెట్టాలని టీడీపీ ఎంపీలు కోరారు. ఏపీ అంశాలపై తర్వాత సమాధానం ఇస్తానని, ఆంధ్రప్రదేశ్ మిత్రులు కాస్త సంయమనంతో ఉండాలని జైట్లీ కోరారు. ఆధార్, జీఎస్టీ వంటి అంశాలు మాట్లాడిన తర్వాత ఎట్టకేలకు ఏపీ గురించి మాట్లాడిన అరుణ్ జైట్లీ మళ్లీ అదే పాత పాట పాడారు. ఏపీకి సాయంపై ఎలాంటి నిర్దిష్ట ప్రకటనా చేయకుండా గతంలో మాదిరిగానే ఇస్తున్నామని, ఇస్తామని పాత మాటలే వినిపించారు. ఎంపీలు చేస్తున్న ఆందోళన గురించి ప్రస్తావించిన ఆర్థికమంత్రి ఏపీకి ఇచ్చిన హామీలను ఇప్పటికే కొన్ని అమలుచేశామని, మరికొన్ని అమలు దశలో ఉన్నాయని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు తాము మద్దతిచ్చినప్పటికీ… ఏపీ హక్కుల కోసం బీజేపీ పోరాడిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి పలు జాతీయ సంస్థలు కేటాయించామని, వాటికి నిధులు ఇస్తున్నామని, ఇంకా ఇస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి, వెనుకబడిన జిల్లాలకు కూడా కొన్ని నిధులు ఇచ్చామని తెలిపారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టి పలుసార్లు నిధులు మంజూరుచేశామని, గత నెలలో నాబార్డ్ ద్వారా నిధులు ఇవ్వాలని ఏపీ సీఎం రాసిన లేఖ ప్రకారం అలానే చేస్తున్నామన్నారు. రెవెన్యూ లోటుకు సంబంధించి ఏపీ అధికారులతో కలిసి లెక్కలు వేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం, ఏపీ అధికారులు నిన్నటి నుంచి చర్చలు కూడా జరుపుతున్నారని తెలిపారు. రైల్వే జోన్ కు సంబంధించి కొన్ని విషయాలు తేలాల్సి ఉందన్నారు. తన మొత్తం ప్రసంగంలో జైట్లీ ఎక్కడా ఏపీ ఎంపీలు కోరుతున్నట్టు అదనపు నిధులు, పోలవరం, రాజధాని వంటి ఏ అంశంపైనా స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో లోక్ సభలో మళ్లీ గందరగోళం చెలరేగింది. టీడీపీ ఎంపీలు జైట్లీ ప్రసంగాన్ని అడ్డుకోవడంతో నడుమ సభ రేపటికి వాయిదా పడింది.