Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత చేయబోతున్న చిత్రంపై మెల్ల మెల్లగా క్లారిటీ వచ్చేస్తోంది. ఇటీవలే రాజమౌళి ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో రాజమౌళితో పాటు ఎన్టీఆర్, చరణ్‌లు ఉన్నారు. ఇద్దరి కలయికలో సినిమాను జక్కన్న చేయబోతున్నట్లుగా అంతా భావించారు. అందులో ఎంత నిజం ఉన్న విషయాన్ని మాత్రం జక్కన్న కాని ఆ ఇద్దరు హీరోలు కాని తేల్చి చెప్పలేదు. మౌనం అర్థ అంగీకారం అన్నట్లుగా భావించిన సోషల్ మీడియా జనాలు గాల్లో మేడలు కట్టినట్లుగా మల్టీస్టారర్ చిత్రం గురించి ఏవేవో ఊహలు అల్లేస్తున్నారు.
ఎన్టీఆర్, చరణ్‌ల కాంబో మూవీ రాబోతుందని, ఇద్దరు అన్నదమ్ముళ్లుగా నటించబోతున్నారు, 150 కోట్ల బడ్జెట్‌తో దానయ్య నిర్మించేందుకు సిద్దం అయ్యాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలోనే మరో ఫొటో సోషల్ మీడియా హల్ చల్ చేయడం మొదలు పెట్టింది. ఈ ఫొటో చరణ్ మరియు ఎన్టీఆర్‌లు చాలా క్లోజ్‌గా కనిపిస్తూ, ఇద్దరు విక్టరీ సింబల్‌ను చూపిస్తున్నారు. ఈ ఫొటో వీరిద్దరి మల్టీస్టారర్‌ను మరింతగా దృడపరుస్తుందనే టాక్ వినిపిస్తుంది. మొత్తానికి చరణ్, ఎన్టీఆర్‌ల కాంబో మూవీ ప్రస్తుతం ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తుంది. ఎప్పుడెప్పుడు అధికారిక ప్రకటన వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల వారిని కూడా సస్పెన్స్‌తో చంపేస్తున్నాయి. నిజం ఏంటనేది ఎప్పుడు తెలుస్తుందో కాని మెగా మరియు నందమూరి అభిమానులు మాత్రం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.