Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికలకు ఇంకా ఏడాది మిగిలే వుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎన్నికల సెగ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మీద ఉమ్మడి దండయాత్ర మొదలైంది. ఇప్పటికే సీఎం రేసులో వున్న జగన్ , కొత్తగా ట్రాక్ ఎక్కిన పవన్ , డిపాజిట్ మీద నమ్మకం లేకపోయినా కేంద్ర ప్రభుత్వ అండతో ఏదో చేద్దాం అనుకుంటున్న బీజేపీ ల ఉమ్మడి లక్ష్యం చంద్రబాబు అనేది ఆంధ్రాలో పసిపిల్లవాడిని అడిగినా చెబుతారు. ఈ క్రమంలో కేంద్రం కొత్త రాష్ట్రానికి చేయాల్సిన సహాయం విషయం పక్కకి పోయి ఏపీ లో ఏదో జరిగిపోతోంది అన్న వాతావరణం కనిపిస్తోంది. ఇదంతా చూస్తున్న సామాన్య ఓటరు కాస్త కన్ఫ్యూజ్ అవుతున్న మాట నిజం. ఆ విషయంలో బీజేపీ కాస్త సక్సెస్ అయినట్టే. అయితే ఈ కన్ఫ్యూజన్ పోగొట్టి ఎవరు ఏమిటో ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పడానికి ఓ మార్గం లేకపోలేదు. అదేమిటంటే …
ఇదేదో కొత్త విషయం ఏమీ కాదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సహా వివిధ సందర్భాల్లో జరిగే ప్రక్రియే,..అదే టీవీ డిబేట్. ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్న బాబు , జగన్ , పవన్ ఒకే వేదిక మీదకు వచ్చి రాష్ట్ర అభివృద్ధి , సమస్యలు , పరిష్కారాలు గురించి తమ తమ వ్యూహాలు వివరించి ఆ పై మిగిలిన వారి ఆలోచనల గురించి నేరుగా ప్రశ్నిస్తే చాలు.ఈ రాష్ట్రం గురించి ఎవరికి ఏమి తెలుసో , ఎవరి విజన్ ఏమిటో జనానికి బాగా అర్ధం అవుతుంది. ఇదే ప్రతిపాదన గురించి ఇటీవల ఓ మంత్రి చంద్రబాబు వద్ద ప్రస్తావిస్తే ఆయన వెంటనే అంతకన్నా కావాల్సింది ఏముంది అన్నారట. అయితే ఆ ఇద్దరు రారేమో అన్న అనుమానం వ్యక్తం చేశారట. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో చంద్రబాబు కన్నా ఎక్కువ పరిజ్ఞానం,అవగాహన ఉంటే జగన్ , పవన్ ఇలాంటి అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. తద్వారా ప్రజలకు తాము ఎంత సమర్థులమో చెప్పుకోవచ్చు. కాదంటారా ?