Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతికి ‘జైసింహా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. ఏమాత్రం మెప్పించలేక పోవడంతో బాలయ్య కాస్త నిరాశ చెందాడు. ఆ చిత్రం తర్వాత బాలయ్య ఎన్టీఆర్ చిత్రాన్ని మొదలు పెట్టాలని భావించాడు. కాని కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. మొదట ఈ చిత్రాన్ని దర్శకుడు తేజ దర్శకత్వంలో చేయాలని భావించిన బాలకృష్ణ ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తాను అనుకున్న రీతిలో తేజ ‘ఎన్టీఆర్’ సినిమాకు న్యాయం చేయలేడనే ఉద్దేశ్యంతో ఆయన్ను తొలగించాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాను క్రిష్ దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అయ్యాడు. ప్రస్తుతం క్రిష్ బాలీవుడ్లో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉంది.
‘ఎన్టీఆర్’ సినిమా ఆలస్యం అవుతున్న కారణంగా ఈ గ్యాప్‌లో వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని బాలకృష్ణ భావించాడు. సి కళ్యాణ్ అందుకు సంబంధించిన ప్రకటన కూడా చేశాడు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లబోతుందని భావిస్తున్న తరుణంలో ‘ఎన్టీఆర్’ సినిమా చేసిన తర్వాత మరే సినిమా అయినా అంటూ బాలయ్య కొత్తగా నిర్ణయం తీసుకున్నాడు. అందుకే వినాయక్‌తో సినిమాను ప్రస్తుతానికి పక్కకు పెట్టేశాడు. మూడు నెలల తర్వాత ‘ఎన్టీఆర్’ సినిమా మొదలు అయ్యే అవకాశాలున్నాయి. ఆగస్టు 15న మణికర్ణిక చిత్రాన్ని విడుదల చేసేందుకు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత సెప్టెంబర్‌లో సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లే అవకాశం ఉంది. మరి ఈ మూడు నెలలు బాలకృష్ణ ఏం చేస్తాడో చూడాలి.