Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ నేతలు భూమా అఖిలప్రియ, నేత ఏవీ సుబ్బారెడ్డిల వ్యక్తిగత కక్షలను టీడీపీ అధినాయకత్వం సీరియస్గా తీసుకుంది. వారిద్దరి మధ్య నెలకొన్న వివాదం రాష్ట్ర రాజధాని అమరావతికి చేరింది. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె తండ్రికి సన్నిహితునిగా వ్యవహరించిన పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డికి మధ్య తరచూ విభేదాలు చోటు చేసుకొంటున్నాయి. పార్టీ పిలుపు మేరకు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న సుబ్బారెడ్డి మీద రాళ్ల దాడి జరిగింది. అయితే ఆ రాళ్ల దాడి వెనుక అఖిలప్రియ వర్గీయులు ఉన్నారన్న సుబ్బారెడ్డి ఆరోపణల మీద చంద్రబాబు సీరియస్ అయ్యారు.
ఎంత నచ్చజెప్పినా ఇద్దరూ వినడం లేదని ఆగ్రహించిన బాబు తనను కలవాల్సిందిగా ఇద్దరినీ ఆదేశించారు. అయితే నిన్న ఈ సమావేశానికి మంత్రి అఖిలప్రియ రాలేకపోవడంతో ఇవాళ మరోసారి వాళ్లతో సమావేశం కానున్నారు. ఇటీవల సుబ్బారెడ్డి నిర్వహించిన సైకిల్ యాత్ర పై దాడి జరిగింది. విభేదాలకు కారణమవుతున్న అంశాలను లోతుగా పరిశీలించి పరిష్కరించాలన్న అభిప్రాయంలో పార్టీ అధిష్ఠానం ఉంది. తండ్రితో సమానమైన తనపై అఖిలప్రియ రాళ్లదాడి చేయించిదని సుబ్బారెడ్డి విమర్శించారు. తాను టీడీపీ కోసమే సైకిల్ ర్యాలీ చేపట్టానని… పార్టీ బలోపేతానికే కృషి చేస్తుంటే అభ్యంతరాలు ఎందుకో అర్థంకావడం లేదన్నారు. తాను పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డలో పోటీ చేస్తానన్నానే కాని… తనకు తానుగా చెప్పలేదన్నారు.
మరోవైపు సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై అఖిలప్రియతో పాటూ సోదరి మౌనిక స్పందించారు ఆళ్లగడ్డ ప్రజలు భూమా కుటుంబం వెంటే ఉన్నారని, ఏవీ సుబ్బారెడ్డికి ఆళ్లగడ్డ ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆమె అన్నారు. భూమ కుటుంబంతో సుబ్బారెడ్డికి ఉన్న సంబంధం తెగిపోయిందంటున్నారని, సుబ్బారెడ్డి తన తండ్రి స్నేహితుడిగా రాజకీయాల్లో ఎదగాలనుకుంటే సహకరిస్తామని ఆమె అన్నారు. అంతేగానీ… తన అక్కపై విమర్శలు చేసి ఎదగాలనుకుంటే మాత్రం తగిన విధంగా బుద్ధి చెబుతాం నాగమౌనిక హెచ్చరించారు.