Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు బీజేపీ రూ. 100 కోట్లు, మంత్రి పదవి ఆఫర్ చేస్తోందంటూ కుమారస్వామి చేసిన ఆరోపణలపై కర్నాటక బీజేపీ ఇన్ ఛార్జ్ ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. కుమారస్వామి ఆరోపణలు ఊహాజనితమని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి పనులకు బీజేపీ దూరమని, కాంగ్రెస్, జేడీఎస్ ఇలాంటి రాజకీయాలు చేస్తాయని ఆయన ఎదురుదాడికి దిగారు. నిబంధనల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని, అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అనుమతించాలని గవర్నర్ ను కోరామన్నారు. యడ్యూరప్ప నాయకత్వంలో కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకం తమకుందన్నారు. మరోవైపు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి ఫిరాయింపులు జరుగుతున్నాయో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.
కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ… తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని ఓ వైపు ప్రకటిస్తోంటే… మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు మాత్రం… ప్రత్యర్థి పార్టీలతో టచ్ లో ఉన్నారంటూ వస్తున్న వార్తలు అయోమయం కలిగిస్తున్నాయి. వాస్తవంగా పరిస్థితి ఏమిటన్నదీ ఎవరికీ అర్ధం కావడం లేదు. బెంగళూరులో కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి కొత్తగా ఎన్నికయిన 78 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 66 మంది మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. మిగతా 12 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారనేదానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజశేఖర్ పాటిల్, నరేంద్ర, ఆనంద్ సింగ్ లు ఈ ఉదయంనుంచి కాంగ్రెస్ నేతలకు అందుబాటులో లేరని తెలుస్తోంది. వీరిలో ఇద్దరు గాలి సోదరులకు సన్నిహితులని, వారు బీజేపీ గూటికి వెళ్లటం ఖాయమని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేయాలనుకుంటున్న జేడీఎస్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన జేడీఎస్ శాసన సభాపక్ష సమావేశానికి ఆ పార్టీకి చెందిన రాజ వెంకటప్ప నాయక, వెంకటరావ్ నాదగౌడ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. దీంతో వారిద్దరూ జేడీఎస్ కు రాం రాం చెప్పారనే ప్రచారం జరిగింది. అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తమపై వస్తున్న ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు. తాము బెంగళూరుకు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్నామని, అందుకే సమయానికి చేరుకోలేకపోయామని, తామెప్పుడూ కుమారన్నతోనే ఉంటామని స్పష్టంచేశారు. మరోపక్క ఎమ్మెల్యేలంతా… తమతోనే ఉన్నారని కాంగ్రెస్, జేడీఎస్ చెబుతున్నప్పటికీ… ఎమ్మెల్యేలు జారిపోకుండా చేపట్టిన సంతకాలసేకరణలో ఆ పార్టీలకు చుక్కెదురయింది. రెండు పార్టీలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సంతకాలు చేయడానికి ముందుకు రాలేదని తెలుస్తోంది. దీనిపై రెండు పార్టీలు స్పందించడం లేదు కానీ… బీజేపీపై ఎదురుదాడికి దిగాయి.
బీజేపీ ఎమ్మెల్యేలే తమతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్, జేడీఎస్ చెబుతున్నాయి. బీజేపీ నేతలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, కాంగ్రెస్ నేతలు ఎంబీ పాటిల్, టీడీ రాజెగౌడ ఆరోపించారు. బీజేపీ నేతలు తమకు అదే పనిగా ఫోన్ లు చేస్తున్నారని, అయినా తాము భయపడడం లేదని, తమకు ఫోన్ చేయవద్దని స్పష్టంగా చెప్పామని వారు అంటున్నారు. జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కప్పదాట్లకు సిద్ధంగా ఉన్నారన్న వార్తల్లో నిజం లేదని, అందరూ ఏకతాటిపై ఉన్నారని తెలిపారు. నిజానికి ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలే తమతో సంప్రదింపులు జరుపతున్నారని పాటిల్ చెప్పారు. మొత్తానికి తాజా పరిణామాలు గమనిస్తే… కర్నాటకం క్లైమాక్స్ చేరడానికి మరికొంత సమయం పట్టేట్టు కనిపిస్తోంది