Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఊహించిందే జరుగుతోంది. కొన్నిరోజులుగా తాజ్ మహల్ పై వివాదం నడిపిస్తోన్న బీజేపీ అసలు అస్త్రాన్ని బయటకు తీసింది. తాజ్ మహల్ దేశద్రోహులు నిర్మించిన కట్టడమని బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం సద్దుమణగకముందే… ఆ పార్టీకే చెందిన ఎంపీ వినయ్ కతియార్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్య చేశారు. తాజ్ మహల్ ఒకప్పుడు హిందూ దేవాలయమైన శివాలయమని, ఆ ఆలయాన్ని తేజోమహాలయ్ అని పిలిచేవారని వినయ్ కతియార్ వ్యాఖ్యానించారు. తేజోమహాలయాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ కూల్చివేసి తాజ్ మహల్ ను నిర్మించిన విషయం వాస్తవమని, అయతే దాన్ని కూల్చేయాలని తాను అడగడం లేదని ఆయన అన్నారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం ఆరునెలలు పూర్తిచేసుకున్న సందర్భంగా పర్యాటక ప్రాంతాలతో విడుదల చేసిన బుక్ లెట్ లో తాజ్ మహల్ పేరు లేకుండా చేసి వివాదం మొదలుపెట్టిన బీజేపీ… ముందు ముందు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుందని రాజకీయ విశ్లేషకులు ఊహించారు. అనుకున్నట్టుగానే వివాదం వెనక బీజేపీ అసలు అజెండాను వినయ్ కతియార్ బయటపెట్టారు.
తాజ్ మహల్ దేశద్రోహులు నిర్మించిన కట్టడమని సంగీత్ సోమ్ వ్యాఖ్యానించడమూ ఇందులో భాగమే. ఇక రేపటినుంచి వినయ్ కతియార్ వ్యాఖ్యల ఆధారంగానే తాజ్ మహల్ పై వాదోపవాదాలు జరగనున్నాయి. నిజానికి వినయ్ కతియార్ చేసిన వ్యాఖ్యలు దేశప్రజానీకానికి కొత్తేమీ కాదు. ఆధునిక చరిత్రకారుల పుస్తకాల్లో తాజ్ మహల్ వెనక అసలు కథ అంటూ ఈ విషయాన్నే చెప్పుకొచ్చారు. ఆరెస్సెస్, వీహెచ్ పీ భావజాలం ఉన్న వ్యక్తులే కాదు… చరిత్రను క్షుణ్ణంగా అర్ధం చేసుకున్న సామాన్యులు అనేకమంది కూడా తాజ్ మహల్ ఒకప్పటి తేజోమహాలయ్ అనే నమ్ముతున్నారు. వినయ్ కతియార్…తేజోమహాలయాన్ని కూల్చివేసి షాజహాన్ తాజ్ మహల్ నిర్మించాడని చెబుతున్నప్పటికీ… ఆధునిక చరిత్ర కారుల వాదన ప్రకారం..షాజహాన్ ఆ కట్టడాన్ని అసలు కొత్తగా నిర్మించలేదు. పాలరాతి కట్టడాన్ని పురాతన హిందూ చక్రవర్తులే నిర్మించారు. అయితే భారతదేశంపై దండెత్తిన గజినీ, ఘోరీ వంటి వారితోపాటు… అఖండ భారతాన్ని పాలించిన ఢిల్లీ సుల్తాన్ లు, మొఘల్ చక్రవర్తులు హిందూ రాజుల అద్భుత కట్టడాలనెన్నింటినో ధ్వంసం చేశారు. మరికొన్ని కట్టడాలను తమ అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకున్నారు. ఆ కోవకు చెందినదే తాజ్ మహల్. ముస్లిం కట్టడాలను తలపించేలా షాజమాన్ తేజోమహాలయాన్ని తాజ్ మహల్ గా మార్చివేశారు తప్ప…ఆయన కొత్తగా కట్టిందేమీ లేదు. అయితే చరిత్రను తమకు తోచిన విధంగా నమోదుచేసిన ముస్లిం చరిత్రకారులు..షాజహానే తాజ్ మహల్ ను నిర్మించాడనడానికి అనేక తప్పుడు ఆధారాలు చూపించారు. ఆ క్రమంలోనే తాజ్ మహల్ డిజైన్ గీసిన రూపశిల్పి చేతులను షాజహాన్ నరికించాడని ప్రచారం చేశారు. ఇక ఇప్పుడు ఈ వాదనలన్నీ తప్పని రుజువుచేసేందుకు బీజేపీ సకల అస్త్రాలనూ ప్రయోగించనుంది.