ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు ఓ వైపు విశేష స్పందన వస్తుండగా ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పార్టీని రోడ్దేక్కిస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరు జడ్పీ చైర్మన్, వైసీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీలో గతకొంత కాలంగా చురుగ్గా ఉన్న బొమ్మిరెడ్డి వెంకటగిరి అసెంబ్లీ టికెట్ ను ఆశిస్తున్నారు. కానీ ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డిని పార్టీ అధిష్ఠానం తాజాగా వెంకటగిరి ఎన్నికల ఇన్ చార్జీగా నియమించడంతో ఆయన మనస్తాపానికి లోనయ్యారు. దీంతో తనకు దక్కాల్సిన వెంకటగిరి నియోజకవర్గం బాధ్యతలను మరొకరికి అందించడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాజీనామా సందర్భంగా బొమ్మిరెడ్డి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ బాధ్యతలు చూస్తున్న తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆనం రాంనారాయణ రెడ్డిని నియమించడం బాధ కలిగించిందని ఆ విషయంలో వైసీపీ అధినేత తనకు కనీస గౌరవాన్ని కూడా ఇవ్వలేదన్నారు. జగన్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, వెంకటగిరిలో పోటీకి రూ.50 కోట్లు ఖర్చువుతాయనీ, అంత పెట్టుకోగలవా? అని జగన్ అడిగారని విమర్శించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని స్పష్టం చేశారు. జడ్పీ సభ్యులు వ్యతిరేకిస్తే, చైర్మన్ పదవిని వదులుకునేందుకు కూడా తాను సిద్ధమేనని రాఘవేంద్రరెడ్డి చెప్పారు.