Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చిన్నా పెద్దా తేడాలేకుండా ప్రతి ఒక్కరూ దసరా వేడుకల్లో పాల్గొన్నారు. వాడవాడలా రావణ దహనం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ఎర్రకోట వద్ద జరిగిన విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఉత్సవాల్లో భాగంగా దహనం కోసం రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు బొమ్మలు ఏర్పాటుచేశారు. వాటిపై వేయాల్సిన విల్లంబులను మోడీ ఎక్కుపెట్టటానికి ప్రయత్నించగా…అది కుదురలేదు. ప్రధాని రెండు, మూడు సార్లు ప్రయత్నించినా విల్లు ఎక్కుపెట్టలేకపోయారు. ఇక లాభం లేదనుకుని ప్రధాని నవ్వుతూ అంబును జావెలిన్ త్రోలా విసిరారు. అనంతరం దసరా ఉత్సవం వైభవంగా సాగింది. పండుగలు సమాజంలో చైతన్యం నింపే ఉత్సవాలని మోడీ అభిప్రాయపడ్డారు. దసరా, దీపావళి వంటి పర్వదినాలు భారతీయ విలువలను కాపాడుతున్నాయని, జాతిని ఏకం చేస్తున్నాయని విశ్లేషించారు. రావణుడినే రాక్షసుడిపై రాముడు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పర్వదినాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. విజయదశమి సందర్భంగా వచ్చే ఐదేళ్లలో సాధించాల్సిన లక్ష్యాలపై ప్రతి ఒక్కరూ ధృఢసంకల్పం చేయాలని అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి భారత ఆర్థిక వ్యవస్థను మరో మెట్టు ఎక్కించాలని పిలుపునిచ్చారు. ఎర్రకోటలో జరిగిన వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.