ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలానికి దారితీసింది. తన కుమార్తెను ప్రేమిస్తున్నాడన్న ఆగ్రహంతో ఓ తండ్రి యువకుడిని బెదిరించగా, భయపడిపోయిన అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈతముక్కల ఎస్సీ కాలనీలో ఈ ఘటన జరిగింది. పురుగుల మందు తాగి వెంకటకృష్ణ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోగా, అతను ప్రేమించిన యువతి తండ్రే కారణమంటూ మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లాలోని ఈతముక్కల గ్రామంలో వెంకటకృష్ణ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే వీరిద్దరి ప్రేమకు అమ్మాయి తరపు కుటుంబస్యులు ఒప్పుకోలేదు. మరో యువకుడితో అమ్మాయికి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలిసిన వెంకటకృష్ణ యువతి వివాహన్ని చెడగొట్టాలని ప్లాన్ చేసాడు. తాను యువతితో కలిసి దిగిన ఫోటోలను ఆమె కుటుంబ సభ్యులకు పంపాడు.దీంతో ఈ పెళ్లి రద్దైంది. పెళ్లి ఆగిపోయిందని తెలిసి మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, యువతి ఆత్మహత్యాయత్నానికి కారణం వెంకటకృష్ణనేని భావించిన అమ్మాయి తరపు బంధువులు అతనిపై బెదిరింపులకు పాల్పడ్డారు.
దీంతో ఇంటికెల్లిన వెంకటకృష్ణ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటకృష్ణ మృతి చెందడంతో కుటుంబసభ్యులు యువతి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. బైక్ ను దగ్దం చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేసి ఘర్షణలు మరింతగా చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులపై కూడ వెంకటకృష్ణ కుటుంబసభ్యులు కూడ దాడికి పాల్పడ్డారు. వెంకటకృష్ణ మృతికి కారణమైన యువతి కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కేసులో మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి, వెంకటకృష్ణ, ఆ యువతి ఒకే సామాజికవర్గానికి చెందినవారు. అయితే వీరిద్దరూ అన్నా చెల్లెళ్ల వరుస అవుతారని యువతి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఈ పెళ్లికి ఒప్పుకోలేదని చెబుతున్నారు.