సివిల్ సర్వీస్ అధికారులు పార్టీలు పెట్టడం కొత్త కాదు. ఐఆర్ఎస్ అధికారి అయిన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టి ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. కానీ దక్షిణాదిలో మాత్రం అలాంటి ప్రయోగాలు విఫలమయ్యారు. ఐపీఎస్‌గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని లోక్‌సత్తా పేరుతో కొంత కాలం ప్రజా సంస్థను నడిపిన జయప్రకాష్ నారాయణ… ఆ తరవాత దాన్ని పార్టీగా మార్చారు. కానీ ప్రజల మద్దతు పొందలేకపోయారు. చివరికి పార్టీలో కుమ్ములాటలు భరించలేక రాజకీయ పార్టీని విరమిచుకుంటున్నట్లు ప్రకటించారు.
తాజాగా తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడుపోసుకోనుంది. గతంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసి, తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రారంభిస్తున్నారు. నవంబరు 26న ప్రకటన చేయనున్న ఆయన, ఆ రోజే పార్టీ జెండా, అజెండాల గురించి వివరించనున్నారు. వైసీపీ అధినేత జగన్, సత్యం కంప్యూటర్స్, గాలి జనార్దన్‌రెడ్డిల అక్రమాల కేసులపై దర్యాప్తులతో లక్ష్మీనారాయణ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసుల విచారణలో ఆయన వ్యవహరించిన తీరు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఐపీఎస్ అధికారిగా పనిచేస్తూనే గ్రామీణ సమస్యలపై, ప్రత్యేకించి రైతుల కష్టాలపై ఆయన అధ్యయనం చేశారు. ఇక, స్వచ్ఛంద పదవీ విరమణ చేశాక ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా పర్యటించారు. గ్రామాలను సందర్శించి నేరుగా రైతులను కలుసుకుని, వారి ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు.
అలాగే, కాలేజీలకు కూడా వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారిని చైతన్యపరిచారు. ఇక, శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోనూ పర్యటించారు. తను పరిశీలిచిన సమస్యలతో ఓ పీపుల్స్ మేనిఫెస్టోను తయారు చేశారు. తన అభిప్రాయాలు, ఆలోచనలకు అనుగుణం ఉండే పార్టీలతో కలసి పని చేసేందుకు సిద్ధమని.. లక్ష్మినారాయణ పదే పదే ప్రకటించారు. అయితే జగన్ కేసుతో ఆంధ్రప్రదేశ్‌లో వీవీ లక్ష్మినారాయణ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నారు. దీంతో ఆయనను తమ పార్టీలోకి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నేతలు ప్రయత్నించారు. రామ్‌మాధవ్ లాంటి నేతలు నేరుగానే ఆహ్వానం పంపారు. మరో వైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా.. తమ పార్టీలో చేరి ఏపీ తరపున బాధ్యతలు తీసుకోవచ్చని ఆఫర్ ఇచ్చింది. ఈ ఊహాగానాలకు ఆయన పుల్‌స్టాప్ పెడుతూ, సొంతంగానే పార్టీ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలే పార్టీ ప్రధాన అజెండాగా ఉంటుందని ఆయన ఇప్పటికే పలుమార్లు ఆలోచనలు చెప్పారు. అలాగే తిత్లీ సందర్భంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలు బాగున్నాయని ప్రశంసిస్తూనే, బాధితుల సమస్యల పరిష్కారానికి స్వల్ప, దీర్ఘకాలిగా చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు. చూడాలి కొత్త పార్టీ ఏమేమి చేయిస్తుందో ?