వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యవస్థాపకుడైన శివకుమార్‌ను సస్పెండ్ చేసిన వ్యవహారంలో మార్చి 11లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ – వైఎస్సార్సీపీని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నల్గొండ జిల్లాకు చెందిన శివకుమార్ స్థాపించారు. ఆ తర్వాత ఈ పార్టీని జగన్‌కు ఇచ్చారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు వైసీపీ అప్రకటిత మద్దతివ్వడాన్ని వ్యవస్థాపకులు అయిన శివకుమార్ వ్యతిరేకించారు. జగన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో తెలంగాణ ఎన్నికల సమయంలో తెరాస అధినేత కేసీఆర్.. వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
వైయస్ దుర్మార్గుడు అన్నారు. దీంతో తెరాసకు ఓటు వేయవద్దని శివకుమార్ పిలుపునిచ్చారు. వైయస్ మరణించే వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, కాబట్టి ఆ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అయితే ఇదంతా తనకు తెలియకుండా జరిగిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసి, శివకుమార్‌ను శాశ్వతంగా బహిష్కరిస్తూ ప్రకటన జారీ చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. జగన్‌కు తనను సస్పెండ్ చేసే అధికారం లేదని, పార్టీ తనదేనని వాదించారు. పార్టీ వ్యవస్థాపక నిబంధనలను జగన్ పక్కన పెట్టారని పార్టీని తిరిగి తనకు స్వాధీన చేయాలని కోరారు. అందుకు అవసరమైన బలనిరూపణకు తాను సిద్ధమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఈసీ నోటీసులు జారీ చేసింది.