భారతీయ సినీ పరిశ్రమలో మొదలయిన ‘మీటూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్ లో నానాపటేకర్, గణేశ్ ఆచార్య, అలోక్ నాథ్, కోలీవుడ్ లో గేయ రచయిత వైరముత్తు, మలయాళంలో నటుడు ముఖేశ్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా వీటిపై హీరోయిన్ అదితీరావు హైదరీ స్పందించింది. చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అన్నది చాలాకాలం నుంచి ఉందని వ్యాఖ్యానించింది. కాంప్రమైజ్ అయి కోరిక తీరిస్తే 3 సినిమాల్లో తనకు ఛాన్స్ ఇస్తామని కొందరు గతంలో ఆఫర్ చేశారని అదితీరావు చెప్పుకొచ్చింది. కానీ అలాంటివి వద్దనుకుని తాను వచ్చేశానని వెల్లడించింది.
తాను ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ వస్తున్నాననీ, ఇలాంటి విషయాల్లో రాజీ పడబోనని తేల్చిచెప్పింది. కొత్తవాళ్లు సినిమా పరిశ్రమలో ఎదగడం చాలా కష్టమనీ, అయితే అసాధ్యం మాత్రం కాదని స్పష్టం చేసింది. దానికి తానే ఉదాహరణ అని చెప్పింది. సినీ పరిశ్రమలో ఎదురయ్యే పరిస్థితులను మనం ఎలా ఎదుర్కొంటామన్న విషయంపైనే కెరీర్ ఆధారపడి ఉంటుందని అదితీరావు హైదరీ చెప్పింది. టాలెంట్ ఉంటే అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయని వెల్లడించింది. ఈ విష్యం మీద అమెరికాలో ఉన్న తన స్నేహితురాలు తనకు కాల్ చేసి మీ అందరూ కలిసి ఈ మీటూ కోసం ఏమైనా చేస్తున్నారా అని అడిగిందని, నేను అవునని చెప్పాలనుకున్నానని కానీ అది చేయలేమేమో అని తనకు అనిపించిందని ఆమె చెప్పుకొచ్చింది.