టీడీపీ, జనసేన మధ్య మున్ముందు కూడా ఘర్షణ వాతావరణం ఉంటుందా లేక ఏమైనా సయోధ్య కుదురుతుందా ? ఈ ప్రశ్నకు ఈ రోజు ఓ ఘటన సమాధానం చెప్పింది. 2014 ఎన్నికల ముందు నుంచి టీడీపీ గురించి, చంద్రబాబు గురించి సానుకూలంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభ తర్వాత రూట్ మార్చారు. టీడీపీ మీద తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఇంతకుముందు నెయ్యం, ఇప్పుడు కయ్యం లో వున్న ఆ ఇద్దరు ఒక్క చోట చేరితే, ఒకరికి ఒకరు ఎదురు పడితే ఎలా ఉంటుందో అని చాలా మందికి ఆసక్తి వుంది. దీనికి కారణం అంతకు ముందు ఆ ఇద్దరూ ఒకరి మీద ఒకరు చూపించుకున్న గౌరవమర్యాదలు. వయసులో పెద్దవాడిగా, సీఎం గా వున్న చంద్రబాబుని పవన్ గౌరవంగా చూడడం ఒక ఎత్తు అయితే పవన్ సచివాలయానికి వస్తే దగ్గరుండి తీసుకెళ్లి, మళ్లీ వీడ్కోలు పలికే స్థాయిలో బాబు ఆయనకు గౌరవం ఇచ్చారు. అలాంటి ఆ ఇద్దరూ ఈరోజు దేవుడు సమక్షంలో ఎదురు పడ్డారు. అక్కడ ఏమైందంటే…
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా లింగమనేని సంస్థ నిర్మించిన దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చారు. లింగమనేని పిలుపు మేరకు వచ్చిన ఆ ఇద్దరూ ఒకే సారి పూజల్లో పాల్గొనాల్సి వచ్చింది. గర్భ గుడి ముందు ఆ ఇద్దరూ ఎక్కువసేపు ఒకే చోట ఉండాల్సి వచ్చింది. ఓ సందర్భంలో మరీ పక్కపక్కనే నించో వలసి వచ్చింది. అయినా ఆ ఇద్దరూ పక్కన వున్న వ్యక్తి పరిచయం ఉన్నట్టు కూడా వ్యవహరించలేదు. చివరికి ఒకరికి ఒకరు మర్యాదపూర్వక అభివాదం కూడా చేసుకున్నట్టు కనిపించలేదు. దీంతో ఆ ఇద్దరూ ఎదురు పడితే ఏమవుతుందో అని ఆసక్తిగా చూసిన వారికి టీడీపీ, జనసేన మధ్య గ్యాప్ ఏ స్థాయిలో వుంది అన్నది అర్ధం అయ్యింది.
వెంకటేశ్వర స్వామి పూజ కార్యక్రమాల కోసం సీఎం చంద్రబాబు వున్న వేదిక దగ్గరకు పవన్ కళ్యాణ్ రావడం కూడా ఆశ్చర్యం కలిగించింది. సహజంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తేనే తండ్రిగా చెప్పుకునే అన్న చిరంజీవికి ఎదురు పడేందుకు కూడా ఒప్పుకొని పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి రావడం విశేషమే. ఇక టీటీడీ గురించి నిన్నే సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఆరోపణల మీద విచారణ జరిపించాలని కోరుకున్న పవన్, అదే ట్వీట్ లో ఈ ఆరోపణల నుంచి టీడీపీ బయటపడుతుందన్న అభిలాష వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే వెంకటేశ్వర స్వామి కార్యక్రమం కోసం ఆ ఇద్దరూ కలవడం చూస్తుంటే ఉప్పునిప్పులా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉందాం అనుకున్నా ప్రకృతి, రాజకీయ పరిస్థితులు భిన్నమైన పరిస్థితికి దారులు వేస్తున్నట్టు అనిపించడం లేదూ!.