Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రజలు టీడీపీని విశ్వసించి అధికారం అప్పజెప్పారని, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్డీయే నుంచి బయటకురావడంపై శాసనమండలిలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఏపీ కష్టాలను కేంద్రం ఏనాడూ పట్టించుకోలేదని, గత నాలుగు బడ్జెట్లతో పాటు చివరి బడ్జెట్ లోనూ రాష్ట్రానికి అన్యాయం చేసిందని మండిపడ్డారు. తాము ఇంకా ఎన్డీఏతో మితృత్వం కొనసాగిస్తామని ఎలా అనుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు అన్ని హామీలు నెరవేరుస్తామని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన బీజేపీ అధికారంలోకి రాగానే మరిచిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో తలసరి ఆదాయంపరంగా అట్టడుగున ఉన్నామని, ఏపీని ఆదుకోవాల్సిన అవసరం కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఏపీపై మోడీ ఎంతో సానుభూతి చూపించారని, ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టిస్తామన్నారని, ఆ హామీలన్నీ ఏమైపోయాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తంచేశారు.
సెంటిమెంట్ తో నిధులు రావని జైట్లీ ఎలా చెబుతారని, తెలంగాణ రాష్ట్రాన్ని సెంటిమెంట్ ద్వారానే ఇచ్చిన సంగతి ఆయనకు తెలియదా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ నేతలు రక్షణ బడ్జెట్ కూడా ఇవ్వమని అడుగుతారని కేంద్ర మంత్రులు హేళనచేశారని, రక్షణ బడ్జెట్ నిధులు అడిగేందుకు తమకు సంస్కారం లేదనుకుంటున్నారా అని చంద్రబాబు ఆగ్రహించారు. మీరొక్కరే దేశాన్ని కాపాడుతారా… మీ ఒక్కరికే దేశభక్తి ఉందా..? మాకు లేదా… అని కేంద్రమంత్రులను ప్రశ్నించారు. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తోంటే కనీసం మాట్లాడదాం రండి అని ప్రధానమంత్రి పిలువలేకపోయారని, తాము నిన్నటి వరకు వేచిచూశామని, తాము ఇక ఎన్డీఏలో ఎందుకు ఉండాలి అని ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందో బీజేపీ ఆత్మవిమర్శ చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. టీడీపీ విలువలు కలిగిన పార్టీ కాబట్టే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగిన తర్వాతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని చంద్రబాబు వివరించారు.