Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సమీప భవిష్యత్ లో ఏ ఎన్నిక జరిగినా విజయం టీడీపీదేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. విజయవాడలో జరుగుతున్న మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలనం చేసి చంద్రబాబు మహానాడు ప్రారంభించారు. చరిత్ర ఉన్నంత వరకూ తెలుగుజాతి గుండెల్లో నిలిచి ఉండే వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమేనన్నారు. 70లక్షల మంది సైన్యంలా పనిచేసే కార్యకర్తలున్న పార్టీ ఇండియాలో టీడీపీ ఒక్కటేనని చెప్పారు. ఎంతో మంది కార్యకర్తల కష్టం ఫలితంగానే రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి పథంలో పయనిస్తోందని, కార్యకర్తలు లేకుంటే పార్టీయేలేదని చంద్రబాబు కొనియాడారు. ఒకప్పటిలా కార్యకర్తలతో ఎక్కువసయయం గడపలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టిన పాపం కాంగ్రెస్ ను అధికారానికి దూరం చేసిందని, ఇప్పుడు రాష్ట్రానికి చేస్తానన్నసాయం చేయకుండా అన్యాయం చేసిన బీజేపీకి అదేగతి పట్టనుందని హెచ్చరించారు.
రాష్ట్రానికి ఉన్న ఇబ్బందులు తాత్కాలికమేనని, మరో నాలుగేళ్లలో దేశంలో టాప్ -3 రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటానన్న నమ్మకం ఉందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నానన్నారు. దేశరాజకీయాలను మార్చేశక్తి టీడీపీకి ఉందని చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 25లోక్ సభ స్థానాల్లో టీడీపీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. నవ్యాంధ్రను బాగుచేసే శక్తి టీడీపీకి ఉందని చెప్పే ప్రజలు అవకాశమిచ్చారని అభిప్రాయపడ్డారు. అలిపిరి ఘటనను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. నాడు 24 క్లైమోర్లు పేల్చినా శ్రీ వెంకటేశ్వరస్వామి తనను కాపాడారని, నవ్యాంధ్రను తాను ముందుండి నడిపించాలన్న ఉద్దేశంతోనే స్వామివారు తనను కాపాడారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తన ప్రసంగంలో బీజేపీపై నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, నమ్మకద్రోహం చేసిన కేంద్రం తీరును నిరసిస్తూ ధర్మపోరాట దీక్షలు చేస్తున్నానని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ఆయన ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలంగాణ కూడా మద్దతిస్తోందన్నారు. విభజన హామీలు నెరవేరుస్తారన్న నమ్మకంతోనే 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, బీజేపీ మోసం గ్రహించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని తెలిపారు. ఎదురుతిరిగిన వారిని తమ దారికి తెచ్చుకునేందుకు బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుమల శ్రీవారి ఆభరణాల అంశంలో కొనసాగుతున్న వివాదం వెనక బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ తెరవెనుక కుట్ర పన్నుతోందని, తిరుమల ఆలయాన్ని పురావస్తు శాఖ ద్వారా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించి…ప్రజావ్యతిరేకతతో వెనక్కి తగ్గిందని తెలిపారు. తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఎవరైనా మట్టికరవాల్సిందే అని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని, బీజేపీ అధికారంలోకి రావడం కల్ల అని ముఖ్యమంత్రి జోస్యం చెప్పారు.
2019లో కూడా అధికారంలోకి వస్తానని చెబుతున్న బీజేపీ, దేశం కోసం ప్రాంతీయ పార్టీలన్నీ ఒక వేదికపైకి వచ్చిన విషయాన్ని గమనించాలన్నారు. కలుషిత రాజకీయాలతో కేంద్రం ముందుకెళ్తోందని, తమిళనాడు రాజకీయాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం ఇందుకు ఉదాహరణ అని విమర్శించారు. ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని తాను ఇచ్చిన పిలుపుమేరకు అక్కడి తెలుగువారు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారని చెప్పారు. కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటుచేయాలని చూసిన బీజేపీ ఆటలు సాగలేదని, ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నిస్తే, ఇందుకు సంబంధించిన ఆడియో టేపులు బయటకు వచ్చాయని అన్నారు. బీజేపీకి అధికారంపై వ్యామోహం తప్ప, అభివృద్ధిపై ధ్యాసలేదని చంద్రబాబు ఆరోపించారు.