Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటం కొనసాగించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. అందుబాటులో ఉన్న పార్టీ నేతలు, మంత్రులతో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లినా బడ్జెట్ లో ఏపీకి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర బడ్జెట్ లో అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఏపీకి కేటాయింపులు జరిపారు తప్ప…ప్రత్యేకంగా చేసిందేమీ లేదని స్పష్టంచేశారు. నోట్ల రద్దు, ఇతరత్రా సమస్యలు తలెత్తినప్పుడు టీడీపీ కేంద్రానికి అండగా నిలిచిందని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, అందుకు తగ్గ న్యాయం జరగాల్సిందేనని తేల్చిచెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ ఎంపీలు బాగా పనిచేశారని, ఏపీ సమస్యను జాతీయస్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. రానున్న రోజుల్లోనూ ఇదే పోరాటం కొనసాగించాలని సూచించారు. కేంద్రంతో మిత్రపక్షంగా కొనసాగుతోంది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని, పదవుల కోసం కాదని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలు ప్యాకేజీ రూపంలో ఇస్తామంటేనే ఆనాడు ఒప్పుకున్నామని, ఈ విషయంపై నేతలంతా స్పష్టతతో ఉండాలని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చిందనేదానిపై లెక్కలు చూపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కేంద్రం ఏం చేసిందనే అంశంపై బీజేపీనే శ్వేతపత్రం ఇవ్వాలని కోరారు. కేంద్రం నుంచి ఎంత మంజూరు చేశారో ఇప్పటివరకూ చెప్పనేలేదని, లెక్కలు తీసి వాస్తవాలను బీజేపీ ప్రజల ముందు ఉంచాలని సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ పోరాటంపైనా చంద్రబాబు తన అభిప్రాయం వ్యక్తంచేశారు. పవన్ ఏర్పాటుచేసిన జేఏసీతో తెలుగుదేశానికి ఎలాంటి ఇబ్బందీ లేదని నేతలకు స్పష్టంచేశారు.
పవన్ పోరాటంలో అర్ధం ఉందని, రాష్ట్రానికి మేలు జరగాలనే కాంక్షతో తనకు తోచిన విధానంలో ముందుకు వెళ్తున్నారని అభిప్రాయపడ్డారు. టీడీపీ ఉద్దేశం కూడా రాష్ట్రానికి మేలు జరగాలనేనని..శ్వేతపత్రాలు అడిగితే సున్నిత పద్ధతిలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు ఏది అడిగినా ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇకపై రోజూ పార్టీకి కొంత సమయం కేటాయిస్తానని, త్వరలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని, అనవసరంగా ఎప్పుడూ ఒకరిని నిందించబోమని చంద్రబాబు చెప్పారు. ప్రతిపక్షం వైసీపీ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలకోసం పాటు పడుతోంటే, జగన్ మాత్రం కేసుల మాఫీ కోసం కేంద్రంతో లాలూచీ పడుతున్నారని మండిపడ్డారు.