Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్రంతో విభేదించినా తమిళనాడు, కేరళ అభివృద్ధిలో ముందున్నాయని, వాటి బాటలోనే మన రాష్ట్రం కూడా అభివృద్ధి సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రం ప్రస్తుతం ప్రాథమిక విద్యలో మూడోస్థానంలో ఉందని, ఐఐటీలో 12శాతం ఫలితాలు ఏపీవేనని చెప్పారు. దేశంలోనే విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ కావాలన్నారు. పేదరికం విషయంలో గుజరాత్, పశ్చిమబెంగాల్ కంటే ఏపీ మెరుగ్గా ఉందని తెలిపారు. వ్యవసాయం, నీరు ప్రగతితో పాటు అనేక అంశాలపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పిడుగులతో ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
పిడుగుల సమాచారం గ్రామీణ ప్రజలకు ముందే చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాంకేతికపరిజ్ఞానం ద్వారా పిడుగుల సమాచారం ముందుగానే అందిస్తున్నా… ఇంకా మరణాలు సంభవిస్తుండడంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఉపాధి హామీ పనుల తీరుపైనా చంద్రబాబు సమీక్ష జరిపారు. రాష్ట్రంలో వ్యవసాయ పనులు పూర్తయ్యాయి కాబట్టి… ఉపాధి పనులు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమయ్యేలోపు నరేగా పనులు గరిష్టంగా చేపట్టాలని, ఈ నెలలోనే రూ. 1,000 కోట్ల విలువైన నరేగా పనులు చేయాలని సూచించారు. రోజువారీ కూలీల హాజరు 23లక్షలకు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటికొరత లేకుండా చూడాలని ఆదేశించారు.