Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్ర బడ్జెట్ తర్వాత టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో చేసిన ఆందోళన జాతీయస్థాయిలో చర్చనీయాంశమయింది. విభజన హామీల అమలు కోసం ఎంపీలు చేస్తున్న పోరాటం ఆంధ్రప్రదేశ్ పై అందరి దృష్టి కేంద్రీకరించేలా చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. హామీల అమలుపై బడ్జెట్ మలివిడత సమావేశాల్లో ఏదో ఒకటి ప్రకటన చేయని పరిస్థితిని బీజేపీ ప్రభుత్వానికి కల్పించింది. ఎంపీల ఆందోళనా కార్యక్రమం తర్వాత రాష్ట్రానికి ఏదైనా మేలు జరుగుతుందన్న నమ్మకం రాష్ట్ర ప్రజల్లోనూ ఏర్పడింది. ఆ నమ్మకం ఆచరణలో కనిపించే వరకు పోరాటం చేయాలని టీడీపీ నిర్ణయించుకుంది.
పోరాటాన్ని ఎంతవరకైనా కొనసాగిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్టీ కోర్ కమిటీ సభ్యులు నారా లోకేష్, కుటుంబరావుతో పాటు మరికొందరితో సమావేశమై కేంద్రంతో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కేంద్రం నుంచి ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాలు సాధించుకోవడం వరకే మన పోరాటం పరిమితమని, దాన్ని ఎంతవరకైనా కొనసాగిద్దామని చంద్రబాబు స్పష్టంచేశారు. జగన్ లాగా కేంద్రానికి పూర్తిగా లొంగిపోవడమో, లేదా కేజ్రీవాల్ లా ప్రతి అంశంలోనూ దూకుడుగా వెళ్లాల్సిన అవసరమో లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలన్నింటినీ ప్యాకేజీ రూపంలో ఇస్తామని ఆర్థికమంత్రి ప్రకటిస్తేనే అంగీకరించామన్నారు. మిత్రపక్షంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం టీడీపీ పోరాడుతోంటే వైసీపీ మాత్రం లాలూచీ రాజకీయాలకు పాల్పడుతోందని సీఎం ఆరోపించారు.
వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాల కంటే వారి నాయకుడిపైనున్న కేసులే ముఖ్యమని, లేకుంటే ప్రత్యేక హోదా ఇస్తేనే వస్తు సేవల పన్ను బిల్లుకు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతిస్తామని ఎందుకు ముడిపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. పునర్ వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందినప్పుడు ఎంపీగా ఉన్నప్పటికీ జగన్ ఒక్కమాట కూడా మాట్లాడలేదని, సమైక్యాంధ్ర ముసుగేసుకుని సోనియాగాంధీతో కుమ్మక్కై బెయిల్ తెచ్చుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ముసుగేసుకుని మరోసారి ప్రజల్ని మోసగించాలని చూస్తున్నారని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకునేందుకు కేంద్రానికి తప్పుడు ఫిర్యాదులు చేస్తూ లేఖలు రాస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు.