Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నవ్య ఆంధ్ర రాజధాని అమరావతిలో సినీ రంగం వేళ్ల్లునుకుంటుందా ?. ఔను అని చెప్పలేని పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తూనే వుంది. టాలీవుడ్ స్టార్స్ , నిర్మాతలు, దర్శకులు ఎవరూ హైదరాబాద్ వదిలిపెట్టి అమరావతి రావడానికి సిద్ధపడడం తర్వాత సంగతి గానీ కనీసం ఆ దిశగా యోచిస్తున్నట్టు కూడా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో విన్నపాలు, వినతులతో చిత్ర సీమ అమరావతికి రాదని సర్కార్ కూడా అర్ధం చేసుకుంది. అందుకే ముందుగా మౌలిక సదుపాయాలు కల్పించి ఆపై కొన్ని తాయిలాలు ఇవ్వాలని భావిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే పక్కా ప్రణాళిక రెడీ చేసింది.
రాజధాని అమరావతి పరిధిలోని అనంతవరం శ్రీ వేంకటేశ్వరస్వామి గుడి దగ్గర 5167 ఎకరాల్లో మీడియా సిటీ ఏర్పాటుకి crda ప్రతిపాదించింది. ఈ మీడియా సిటీలో టెలివిజన్, చలన చిత్ర రంగాలతో ముడిపడివున్న అన్ని విభాగాలు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇక్కడ స్టూడియో ఏర్పాటు చేయడానికి వచ్చే వారికి ఎకరం 50 లక్షల ధరలో 20 నుంచి 30 ఎకరాల దాకా కేటాయిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగ్ లకు సింగల్ విండో అనుమతితోపాటు ఇక్కడ తీసే సినిమాలకు నగదు ప్రోత్సాహకాలు, కొంత ఖర్చు రీ ఇంబర్స్ చేయడం లాంటి విషయాలను ఏపీ సర్కార్ పరిశీలిస్తోంది.
ఇక ఇక్కడ ఏర్పాటు చేసే న్యూస్ చానెల్స్ కి కూడా తక్కువ ధరకు భూములు ఇవ్వాలని ఏపీ సర్కార్ ఆలోచన. ఇక దశలవారీగా మీడియా , సినీ రంగాల్ని ఆకర్షించడానికి ఓ ప్రణాళిక కూడా సిద్ధం అయ్యింది. ఇందులో భాగంగా తొలిదశలో 2017 నుంచి 2021 మధ్య సమగ్ర వాణిజ్య పార్క్ నిర్మించి అక్కడకు మీడియా హౌస్ లు వచ్చేలా కృషి చేస్తారు. ఇక రెండో దశలో ఓ 15 ఏళ్ల పాటు అంటే 2021 నుంచి 2036 వరకు ఇంటర్నేషనల్ స్థాయిలో అమరావతి ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఇందుకోసం ఇక్కడ అంతర్జాతీయ స్థాయి స్టూడియో నిర్మాణం చేయాలని చంద్రబాబు సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా బాలీవుడ్ ప్రముఖులు అజయ్ దేవగన్, సుభాష్ ఘాయ్ లాంటి వాళ్ళతో చర్చలు కూడా జరిపింది. మొత్తానికి 2021 కల్లా అమరావతిలో టాలీవుడ్ అనే మాట వినిపించేలా చేసేందుకు చంద్రబాబు సర్కార్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది.