Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తరచుగా క్షిపణి దాడులు చేస్తూ కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియాను దారికి తచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి చర్యలు ప్రారంభించారు. ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబు పరీక్షించటంపై ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తంచేసిన ట్రంప్ బలమైన అస్త్రం బయటికి తీసేందుకు సిద్దమయ్యారు. విదేశీ వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించి ఉత్తరకొరియాపై కఠిన ఆంక్షలు విధిస్తూ కొత్త ముసాయిదా రూపొందిస్తున్నామని అమెరికా ఆర్థిక శాఖ ప్రకటించింది. దీని ప్రకారం ఉత్తరకొరియాతో వాణిజ్య లావాదేవీలు నిర్వహించే ఏ దేశం అయినా అమెరికాతో వ్యాపారం చేసేందుకు కుదరదు. ఇది ఉత్తరకొరియాతో పాటు చైనాకు పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. విదేశీ వాణిజ్యం కోసం ఉత్తరకొరియా చైనాపైనే పూర్తిగా ఆధారపడుతోంది.
ఆ దేశానికి 90శాతం వాణిజ్య సహకారం చైనా నుంచే అందుతోంది. ఉత్తరకొరియాకు చిరకాల మిత్రదేశంగా ఉన్న చైనా ఇప్పుడు ఆ బంధాన్ని వదులుకోదు. అయితే అమెరికా ముసాయిదా అమలు చేస్తే చైనా ఉత్తరకొరియాపై ఒత్తిడి పెంచే అవకాశముందని, అలా ఉత్తరకొరియా దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట వేయొచ్చని అమెరికా భావిస్తోంది. ఎందుకంటే..చైనాకు ఉత్తరకొరియాతో ఉన్నట్టుగానే అమెరికాతో కూడా వ్యాపార లావాదేవీలు ఉన్నాయి.
అమెరికా చైనా మధ్య వందల బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. చైనా వస్తువులు అమెరికాకు భారీ ఎత్తున ఎగుమతి అవుతుంటాయి. అమెరికా నిర్ణయం వల్ల చైనా ఆ దేశంతో వ్యాపారం చేసే అవకాశం కోల్పోతుంది. దీనివల్ల చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చైనా ద్వారా ఉత్తరకొరియాకు చెక్ పెట్టాలని ట్రంప్ ప్రణాళిక రచిస్తున్నారు. కొత్త ముసాయిదా అమలు చేయాలని అమెరికా గనక నిర్ణయం తీసుకుంటే ఆ ప్రభావంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయన్న ఆందోళనా సర్వత్రా వ్యక్తమవుతోంది.
మరిన్ని వార్తలు: