ప్రతిష్ఠాత్మక పోలవరం నిర్మాణంలో నేడు ఒక చారిత్రిక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రాజెక్టులో ఇప్పటికే పలు ముఖ్యమైన నిర్మాణాలు పూర్తికాగా, తాజాగా స్పిల్‌వే గ్యాలరీ వాక్‌ను సిద్ధం చేశారు. ఈ ఉదయం 10:05 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిని ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం ఆదేశించారు. ప్రారంభానికి 20 నిమిషాల ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు పోలవరం చేరుకోవాలంటూ మంగళవారం సీఎంవో ఆహ్వానాలు పంపింది. ముందుగా 48వ బ్లాక్‌లో సీఎం గ్యాలరీలోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి 36వ బ్లాక్ వరకు నడుస్తారు. అక్కడనుంచి బయటకు వచ్చేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటుచేశారు.
అటునుంచి ఆయన వెలుపలకు వచ్చి, నేరుగా బహిరంగసభా స్థలికి చేరుకొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించిన 5 వేల మందికిపైగా సందర్శకులతో ఆయన సమావేశమవుతారు. గ్యాలరీ లోపలి భాగాన స్టాండింగ్ ఏసీలను అమర్చా రు. ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధం చేశారు. అయితే విజయవాడ నుంచి పోలవరం గ్యాలరీ సందర్శనకు బయలుదేరిన ప్రజాప్రతినిధులకు మార్గం మధ్యలో ఆటంకం ఏర్పడింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయాణిస్తున్న బస్సు ఏలూరు సమీపంలోకి రాగానే మట్టిలో దిగబడటంతో వారి ప్రయాణానికి కొద్దిసేపు ఆటంకం ఏర్పడింది. అయితే, బస్సులో ఉన్న 35మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేరే వాహనాల్లో పోలవరంకి పంపారు.