వేణుమాధవ్ తెలుగు చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన కమెడియన్. కానీ గత కొంతకాలంగా ఆయనకి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఆమధ్య నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో తెదేపా తరపున ప్రచారం చేసి జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు కూడా. అయితే రాజకీయాలు నచ్చాయో లేక రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనుకున్నారో తెలీదు కానీ తన సొంత ఊరు కోదాడ నుండి పోటీకి సిద్దమని ప్రకటించారు. అయితే మొదటినుండి కూడా వేణు మాధవ్ కి టీడీపీ పార్టీ అంటే ఎనలేని అభిమానం. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు పార్టీ సభల్లో తన మిమిక్రితో ప్రచారం చేశారు. అప్పట్లో సినిమా అవకాశాలు వస్తుండటంతో రాజకీయాలకి దూరం అయ్యారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరుపున పోటీ చేద్దామనుకున్నా చంద్రబాబు సూచన మేరకు ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు.
అయితే తెలంగాణలో తాజాగా ఎన్నికలు జరుగుతున్ననేపథ్యంలో ఈసారి అయినా పోటీ చేద్దాం అనుకుంటే పొత్తులో భాగంగా తన సొంత నియోజకవర్గమైన కోదాడ కాంగ్రెస్ పార్టీ వశమైంది. దీంతో స్వత్రంత్ర అభ్యర్థిగా బరిలో దిగటానికి సిద్దమయ్యారు. తాజాగా నామినేషన్ వేసేందుకు కోదాడ తహసీల్దార్ కార్యాలయినికి వెళ్లారు. అయితే వేణుమాధవ్ కి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. నామినేషన్ పాత్రలు సరిగాలేకపోవటంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించారు. దీంతో ఆయన వెనుదిరిగారు. పూర్తిస్థాయిలో పత్రాలను సేకరించుకున్న తర్వాత మళ్లీ తాను నామినేషన్ దాఖలు చేస్తానని వేణుమాధవ్ తెలిపారు. అయితే ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించడానికి వస్తున్నప్పుడు పూర్తిగా రాజకీయనాయకుడి గెటప్ లో కనిపించి కనువిందు చేసారు.