Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటక ఎన్నికల ఫలితాలు విడుదలయిన దగ్గరనుంచి ఎమ్మెల్యేలను ఒకచోటనుంచి మరో చోటకు తరలించేందుకు కాంగ్రెస్ జేడీఎస్ లు శర్మ ట్రావెల్స్ కు చెందిన టూరిస్ట్ బస్సులనే వాడుతున్నాయి. ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించింది కూడా ఈ బస్సుల్లోనే. కాంగ్రెస్, జేడీఎస్ లు ఈ బస్సులనే వాడటానికి ఓ కారణం ఉంది. శర్మ ట్రావెల్స్ సంస్థ యజమాని డీపీ శర్మ కాంగ్రెస్ కు అత్యంత విశ్వాసపాత్రుడు. రాజస్థాన్ కు చెందిన శర్మ 1980ల్లో కాంగ్రెస్ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా పేరు సంపాదించిన శర్మ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 1998లో దక్షిణ బెంగళూరు నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయారు.
దివంగత ప్రధానులు పీవీ నరసింహారావు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలతో శర్మ సన్నిహితంగా ఉండేవారు. డీపీ శర్మ 2001లో చనిపోయారు. ప్రస్తుతం శర్మ ట్రావెల్స్ ను ఆయన కుమారుడు సునీల్ కుమార్ శర్మ నడుపుతున్నారు. శర్మ ట్రావెల్స్ కు చెందిన లగ్జరీ బస్సులు బెంగళూరు నుంచి ముంబై, పూణె, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, గోవా, ఎర్నాకులం ప్రాంతాలకు తిరుగుతాయి. భారత్ లో లెక్సియా, వోల్వో బస్సు సర్వీసులను పరిచయం చేసింది శర్మ ట్రావెల్సే. కర్నాటక రాజకీయాల కారణంగా.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.