Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ ఫలితాలను విశ్లేషిస్తూ ప్రధాని నరేంద్రమోడీ దేశం సంస్కరణలకు సిద్ధంగా ఉందని చేసిన వ్యాఖ్యలపై దళిత హక్కుల నేత జిగ్నేష్ మేవానీ వ్యంగ్యంగా స్పందించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో దేశం మార్పుకోసం సిద్ధంగా ఉందని జిగ్నేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వాడ్ గామ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన జిగ్నేష్ అక్కడి నుంచి ప్రధాని మోడీ స్వస్థలమైన వాద్ నగర్ కు 50 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహిస్తామని తెలిపారు. వాద్ నగర్ వ్యక్తికి వాడ్ గామ్ ప్రజలు తగిన బదులిచ్చారని జిగ్నేష్ వ్యాఖ్యానించారు. దేశం మార్పుకు సిద్ధంగా ఉందని, అందువల్లే బీజేపీ 150 సీట్లు లక్ష్యంగా పెట్టుకుంటే 99 సీట్లు మాత్రమే గెలుపొందిందని ఆయన విమర్శించారు. ఇది ఆరంభం మాత్రమేనని, మార్పు కోసం త్వరలో తుఫాన్ రాబోతోందని జిగ్నేష్ ట్వీట్ చేశారు. ఉనాలో దళితులపై గో రక్షకుల దాడికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనతో జిగ్నేష్ మేవానీ తెరపైకి వచ్చారు. దళితుల ఆశాకిరణంగా గుర్తింపు పొందుతున్నారు.
ఓబీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువనాయకుడు అల్ఫేశ్ ఠాకూర్, పటీదార్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ తో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన జిగ్నేశ్ బీజేపీ అభ్యర్థిపై దాదాపు 20వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. లాయరైన జిగ్నేశ్ కొంతకాలం జర్నలిస్ట్ గా పనిచేసి ఆ తర్వాత సామాజిక కార్యకర్తగా మారారు. ఉనాలో ఓ చనిపోయిన ఆవు చర్మాన్ని వలుస్తుంటే నలుగురు దళిత యువకులపై అగ్రవర్ణాలకు చెందిన యువకులు దాడిచేసి దారుణంగా హింసించారు. ఆ సంఘటన జిగ్నేశ్ జీవితాన్ని మార్చివేసింది. బాధిత దళితయువకులకు న్యాయంచేయాలని ఆందోళన చేపట్టారు. దళితుల హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాడేందుకు ఉనా దళిత్ అత్యాచార్ లడత్ సమితి ఏర్పాటుచేశారు. ఉనా సంఘటన తరువాత జిగ్నేశ్ తమకు ఎంతో మేలుచేశారని బాధితుడు సర్వాయ తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడుతున్న జిగ్నేశ్ రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తారని దళితనాయకులు విశ్వాసంతో ఉన్నారు. ఆయన విజయం ఎందరో సామాజిక కార్యకర్తలకు స్ఫూర్తినిస్తుందంటున్నారు.