Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
1998లో కృష్ణ జింకను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ కు జోధ్ పూర్ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. ఈ కేసులో సుమారు 20 ఏళ్ల తర్వాత జోధ్ పూర్ కోర్టు తీర్పు వెలువరించింది. హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ కోసం 1998లో సల్మాన్ ఖాన్, సైఫ్ అలీఖాన్, సోనాలీ బింద్రే, టబూ, నీలమ్ జోధ్ పూర్ వెళ్లారు. షూటింగ్ విరామంలో కంకణి గ్రామంలో సంచరిస్తున్న రెండు కృష్ణజింకలపై సల్మాన్ కాల్పులు జరిపాడు. ఆ శబ్దం విన్న కంకణి గ్రామస్థులు ఉలిక్కిపడి అక్కడకు రాగా..రెండు కృష్ణజింకలు చనిపోయిఉన్నాయి. కొందరు గ్రామస్తులు సల్మాన్ ను వెంబడించగా ఆయన తప్పించుకున్నాడు. కంకణి గ్రామంలో ఉండేవారంతా భిష్ణోయ్ వర్గానికి చెందిన వారు. కృష్ణజింక భిష్ణోయ్ వర్గానికి కులదైవం. దీంతో ఆ గ్రామస్థులు సల్మాన్ తో పాటు ఇతర నటీనటులపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. సల్మాన్ పై వన్యప్రాణి సంరక్షణ చట్టం 9,51 సెక్షన్ల కింద, మిగతావారిపై సెక్షన్ 149 కింద పోలీసులు కేసు నమోదుచేశారు. అప్పటినుంచి జోధ్ పూర్ కోర్టులో ఈ కేసు దర్యాప్తు కొనసాగింది. సల్మాన్ ఈ కేసులోపలుమార్లు జైలుకు వెళ్లొచ్చాడు కూడా. మార్చి 28న ఈ కేసు విచారణ ముగిసింది. ఇవాళ తీర్పు ప్రకటించారు. సల్మాన్ ను దోషిగా నిర్ధారించి ఐదేళ్లు జైలుశిక్ష విధించిన జోధ్ పూర్ కోర్టు మిగతావారిని నిర్దోషులుగా ప్రకటించింది.
అటు సల్మాన్ శిక్షతో బాలీవుడ్ దిగ్భ్రాంతికి గురయింది. సల్మాన్ తో సినిమాలు తీస్తున్న నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సల్మాన్ శిక్ష వల్ల రూ. 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టులపై ప్రభావం పడనుంది.సల్మాన్ ప్రస్తుతం ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా దర్శకత్వంలో రేస్ 3 సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే దుబాయ్ లో షూటింగ్ షెడ్యూల్ ముగిసింది. ఈద్ కానుకగా జూన్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సుమారు రూ. 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక సల్మాన్ నటిస్తున్న మరోసినిమా అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో అతుల్ అగ్నిహోత్రి నిర్మిస్తున్న భరత్. ఈ సినిమా బడ్జెట్ రూ. 300 కోట్లు. ఈ రెండు సినిమాల తర్వాత సల్మాన్ సోనాక్షిసిన్హాతో కలిసి దబాంగ్ 3 లోనూ, కిక్ సీక్వెల్ కిక్ 2 ప్రాజెక్టులోనూ నటిస్తున్నాడు. ఇవి రెండూ భారీ బడ్జెట్ సినిమాలే. ఈ సినిమాలతో పాటు దస్ కా దమ్, రియాల్టీ షో బిగ్ బాస్ లకు సల్మాన్ యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. జైలు శిక్ష నేపథ్యంలో ఆయన సినిమాలు, కార్యక్రమాలపై సందిగ్ధత నెలకొంది. నిర్మాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.