ఎన్నికల వేళ ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు ప్రతిపక్షానికి జంప్ చేస్తున్నారు. ఐప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీలో కీలక నేత, టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పేరున్న దాసరి జై రమేశ్ వైసీపీలో చేరనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆయన జగన్‌ను కలవనున్నారు. విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన్ను పోటీకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాసరి జై రమేశ్ ప్రముఖ వ్యాపారవేత్త. విజయ్ ఎలక్ట్రికల్స్ ఛైర్మన్. విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు జై రమేష్ ఆసక్తి చూపిస్తున్నారు. 6 నెలలుగా ఆయన జగన్‌తో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. టికెట్ విషయమై ఆయన జగన్‌తో జరిపిన చర్చలు ఫలించాయని, దీంతో ఆయన వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారని సమాచారం. దాసరి జై రమేష్ ఎన్టీ రామారావు కుటుంబానికి సన్నిహితుడు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రమేష్ కీలకంగా వ్యవహరించారు. ఇటీవలే దగ్గుబాటి జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. త్వరలో ఆయన వైసీపీలో చేరనున్నారు. ఇప్పుడు రమేష్ కూడా రెడీ అయ్యారు.