Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈనెల 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ తదితర పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అయితే బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోరు ఉండబోతోందని సర్వేలు, వెలువడుతుంటే జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మాత్రం ఈసారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పటికే ప్రజలు తమవైపు వున్నారని, అలానే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన చంద్రబాబు, కేసీఆర్ ల మద్దతు తమకు ఉందని, వారు మమ్మల్ని గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేస్తున్నారు.
కర్ణాటకలో పెద్ద ఎత్తున తెలుగు సెటిలర్లు ఉన్నారు. సుమారు 50 నియోజకవర్గాల్లో తెలుగు సెటిలర్లు అభ్యర్థుల జయాపజయాల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీపై చంద్రబాబు అసహనంగా ఉండటం, అటు కేసీఆర్ ఏర్పాటు చేయబోయే ఫ్రంట్ బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఉండబోతుండటంతో కర్ణాటకలో తెలుగు సెటిలర్ల ఓట్ల విషయంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు మద్దతు తమకు ఉంటుందని దేవెగౌడ భావిస్తున్నారు. అయితే ఈ నెల 15న పోలింగ్ ఫలితాలు వెలువడనుండగా 17 న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు.