Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్‌బాబు ఒక వైపు ‘భరత్ అను నేను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భరత్ అను నేను’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు అని టీజర్ చూసిన తర్వాత అర్థం అయ్యింది. ఇక మహేష్‌బాబు 25వ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతుందనగా ఒక పుకారు మహేష్‌బాబు అభిమానులను కలవర పెడుతోంది. ఈ చిత్రం న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుందని, ప్రసాద్ వి పొట్లూరి ఈ చిత్రంపై కేసు వేశాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మొదట ప్రసాద్ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించాలని భావించాడు. కాని కొన్ని కారణాల వల్ల నిర్మాతలు మారారు. దాంతో ప్రసాద్ వి పొట్లూరి నిర్మాతల మండలికి వెళ్లడం, అక్కడ నుండి కోర్టుకు వెళ్లడం జరిగింది. ఆ వివాదం ముగిసి పోయి మళ్లీ చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ప్రసాద్ వి పొట్లూరి కోర్టు నుండి స్టే తీసుకు వచ్చాడు అంటూ పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఆ విషయంపై దర్శకుడు వంశీ పైడిపల్లి క్లారిటీ ఇచ్చాడు. మహేష్‌బాబుతో తాను చేయబోతున్న సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేవని, త్వరలోనే సినిమాను ప్రారంభించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. మహేష్‌బాబు 25వ చిత్రం అవ్వడంతో అన్ని విషయాల్లో ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని తీసుకుని తెరకెక్కిస్తున్నట్లుగా దర్శకుడు పేర్కొన్నాడు.